ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ శాఖ పచ్చజెండా త్వరలోనే పనులు ప్రారంభం
సాక్షి, ముంబై: నగరానికి ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ భారీ స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్మారకం పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇదివరకే రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల నుంచి అనుమతులు లభించడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం వేచిచూస్తున్నారు. గత ఏడు నెలలుగా అనుమతి కోసం కేంద్ర పర్యావరణ శాఖ వద్ద ఈ ప్రతిపాదన పెండింగులో ఉంది. ఇటీవల ఆ శాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు త్వరలో అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అది నెరవేర్చడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ అనుమతికి సంబంధించిన సర్క్యూలర్‌ను త్వరలో జారీ చేస్తామని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవమైన ఛత్రపతి శివాజీ స్మారకాన్ని అరేబియా సముద్రంలో నెలకొల్పాలని పదేళ్ల కిందటే ప్రతిపాదించారు. అందుకు బాంద్రా, మాహిం, శివాజీపార్క్, గేట్ వే ఆఫ్ ఇండియా తదితర ప్రాంతాలను ఎంపిక చేశారు. చివరకు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ సముద్ర తీరంలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తీరం నుంచి కిలోమీటరు దూరంలో ఈ భారీ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అందుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకోవడం అనివార్యమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్-ఎన్సీపీ (డీఎఫ్ కూటమి) ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కొనసాగడంవల్ల ఈ ప్రతిపాదన పెండింగులో పడిపోయింది. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎఫ్ కూటమి తమ మేనిఫెస్టోలో శివాజీ స్మారకం అంశాన్ని పొందుపరిచింది. ఆ తర్వాత 2009లో కూడా దీని ఏర్పాటుపై హామీ ఇచ్చింది. కాని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఈ ప్రతిపాదన పెండింగు దశలోనే ఉండిపోయింది. కాని ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శివాజీ స్మారకం ప్రతిపాదన మరోసారి తెరమీదకు వచ్చింది. అనుమతివ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. ఎట్టకేలకు పర్యావరణ శాఖ నుంచి అనుమతి లభించడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.
శివాజీ స్మారకానికి లైన్ క్లియర్
Published Fri, Dec 5 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement