57 రోజులు... 19 హత్యలు | 19 murders in 57 days | Sakshi
Sakshi News home page

57 రోజులు... 19 హత్యలు

Published Wed, Jul 23 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

57 రోజులు... 19 హత్యలు

57 రోజులు... 19 హత్యలు

మాయమైపోతున్నాడమ్మా....మనిషన్నవాడు
 మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు
 నూటికో కోటికో ఒకే ఒక్కడు
 యాడ ఉన్నాడో కానీ కంటికే కానరాడు

 
 అంటూ ఓ సినీకవి అంతరించిపోతున్న మానవ సంబంధాలపై రాసిన మాటలు అక్షరసత్యాలు అనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలు, వివాహేతర సంబంధాల కారణంగా ఈ రెండు నెలల కాలంలో హత్యల పరంపర కొనసాగింది. కేవలం 57 రోజుల వ్యవధిలోనే 19 హత్యలు జరిగాయి.     
 
 భానుపురి :ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న..ఇందుకు పథక రచన చేసిన తండ్రి..డబ్బులు ఇవ్వలేదని తాతను చంపిన మనుమడు.. తన భార్యతో చనువుగా ఉన్న స్నేహితుడిని ఇంటికి పిలిపించి పూటుగా మందు తాపించి చంపిన వ్యక్తి.. ఆర్థిక లావాదేవీలతో ఇద్దరిని కిరాతంగా నరికి చంపిన నిందితులు.. ఇలాంటి వ్యాఖ్యలు వింటానికే భయమేస్తోంది కదూ.. ఇవి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల్లో కొన్ని మాత్రమే. వీటిలో కొన్ని క్షణికావేశంలో జరిగితే..మరికొన్ని కక్ష, ప్రతికారంతో రగిలిపోయి పథకం ప్రకారం చేసినవి.   
 
 మొత్తంగా జిల్లాలో 57రోజుల్లో 19 హత్యలు జరిగాయి. గతంలో రాజకీ య హత్యలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయి. కానీ జిల్లాలో వారంలో కనీసం రెండు హత్యలైనా ఏదో ఒక చోట జరుగుతున్నాయి. హత్యలకు ముఖ్యంగా భూవివాదా లు, వివాహేతర సంబంధాలు కారణాలుగా ఉంటున్నాయి. జిల్లాలో  రెండు నెలల్లో సు మారు 19 మంది హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీటిలో భూవివాదాలు, అక్రమ సంబధాల కారణంతో జరిగిన హత్యలే అధికంగా ఉన్నాయి. కేవలం డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తృణప్రాయంగా తీస్తున్నారు. అదే విధంగా అక్రమ సంబంధాల కారణంగా హత్యలకు పాల్పడుతున్నారు.
 
 గొంతు కోసి..
 ఇటీవల జరిగిన కొన్ని హత్యల్లో దుండగులు వ్యవహరించిన తీరు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది. గొంతులు కోసి ప్రాణం తీస్తున్నారు. ఇటీవల కనగల్ మండలం కమ్మరిగూడెంలో గౌసొద్దీన్, రవికుమార్‌లను కేవలం ముఖం, గొంతుపైనే నరికారు. దాదాపు శరీరం నుంచి తలవేరయ్యే దాకా నరికారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో నల్లగొండ మాజీ కౌన్సిలర్ గుత్తా రాజేందర్‌రెడ్డిని కూడా గొంతు కోసి చంపారు. రెడ్యానాయక్‌ను కూడా తాడుతో గొంతుకు చుట్టి చంపారు. మరెక్కడైనా నరికితే బతికి బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్న దుండగులు గొంతులను కోయడంగానీ, తెగిపోయే వరకు నరకడం గానీ, తాడుతో ఉరి వేయడంగానీ చేస్తున్నారు.
 
 మే 26 నుంచి..
 మే 26న బీబీనగర్ మండలం జంపల్లి గ్రామానికి చెందిన కేతావత్ రెడ్యానాయక్ ను తండ్రి, అన్న కలిసి కిరాయి హంతకుల తో కిడ్నాప్ చేయించారు. అదేరోజు తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గుట్టలో హత్య చేసి పడేశారు. ఈ విషయం జూలై9వ తేదీన వెలుగులోకి వచ్చింది.
 
 మే 30న తుర్కపల్లి మండల పరిధిలోని మోతీరాంతండాలో రాతీరాం అనే వ్యక్తిని అదే తండాకు చెందిన మహేందర్ హత్య చేసి అతని ఒంటిపై ఉన్న నగలను అపహరించాడు. అనంతరం అతను జైలు నుంచి విడుదల అయ్యాక రాతీరాం కుటుంబ సభ్యులు ప్రతీకారంతో మహేందర్‌ను హత్య చేశారు.
 
 జూన్ 9న భువనగిరి పట్టణంలోని రామక్రిష్ణాపురంలో రైతు బండ యాదగిరిని భూవివాదాల కారణంగా పొలం వద్ద హత్య చేశారు.
 
 13న సూర్యాపేటలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గోగుల శ్రీకాంత్‌ను కుంచం రవి అనే వ్యక్తి హత్య చేశాడు.
 
 20న హాలియాలో భూవివాదాల కారణంగా వంగూరి సైదులును చంపివేశారు.
 
 22న కోదాడలోని శ్రీరంగాపురంలో గుర్తు తెలియని వ్యక్తిని డబ్బు కోసం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
 
 23న నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో నల్లగొండ మాజీ కౌన్సిలర్ గుత్తా రాజేందర్‌రెడ్డిని స్నేహితుడే హత్య చేశారు. ఈ హత్యకు స్నేహితుడి భార్యతో రాజేందర్‌రెడ్డి చనువుగా ఉంటున్నాడన్నది ప్రధాన ఆరోపణ.
 
 26న కనగల్ మండల పరిధిలోని దర్వేశిపురం వద్ద వివాహేతర సంబంధాల కారణంతో విజయ అనే మహిళను నూర్ మహ్మద్ హత్య చేశాడు.
 
 27న పెద్దవూర మండల పరిధిలోని వెల్మగూడెంలో డబ్బు లావాదేవీల విషయంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ వెంకటేశ్వర్లును హత్య చేశారు.
 
 జూలై 1న  శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో ఆస్తి తగాదా విషయంలో బంధువులు గుండెబోయిన వెంకటయ్యను హత్య చేశారు.
 
 2న గరిడేపల్లి మండల పరిధిలోని కోనాయిగూడెంలో భూవివాదాల కారణంగా అంబటి జగన్ హత్యకుగురయ్యాడు.
 
 3న హైదరాబాద్‌లో జిల్లాలోని చింతపల్లికి చెందిన రియల్టర్ అల్గుబెల్లి వెంకటరెడ్డిని డబ్బు విషయంలో దుండగులు హత్య చేశారు.
 
 7న బీబీనగర్ మండల పరిధిలోని గూడూరులో వివాహేతర సంబంధం పెట్టుకుందని జ్యోతి అనే మహిళను భర్త హత్య చేశాడు. నీళ్లులేని బావిలో పడేశాడు.
 
 8న కనగల్ మండలం కుమ్మరిగూడెంలో ఆర్థిక లావాదేవీల కారణంగా ప్రత్యర్థులు గౌసొద్దీన్, రవికుమార్‌లను కత్తులు, వేటకొడవళ్లతో నరికి చంపారు.
 
 10న వేములపల్లి మండలంలో డబ్బులు ఇవ్వలేదని తాత పగడాల మారయ్యను మనవడు హత్య చేశాడు.
 11న తుర్కపల్లి మండల పరిధిలోని గొల్లగూడెంలో ధరావత్ నర్సింహనాయక్‌ను డబ్బు కోసం హ త్య చేశారు.
 
 16న మల్లెపల్లిలో భూవివాదాల కారణం గా మాజీ సర్పంచ్ భర్త రమావత్ రవికుమార్ హత్యకు గురయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement