కిడ్నాప్ చేశారని ఆందోళన
భానుపురి :మున్సిపల్ పాలకవర్గం ఎన్నికల సందర్భంగా టీడీపీ, సీపీఎం కౌన్సిలర్లను టీఆర్‌ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని సీపీఎం నాయకులు ఆ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, సీపీఎం నాయకుల మధ్య స్వల్ప తగాదా నెలకొంది. గమనించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అందరిని సముదాయించారు. సీపీఎం నాయకులతో చర్చిం చారు. తెలంగాణను సాధించిన పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులను ఆయన కోరారు. తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, వీరిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని సమాచారం రావడంతో తమ నాయకులు వెళ్లి టీడీపీ కౌన్సిలర్ గునగంటి వంశీధర్, సీపీఎం కౌన్సిలర్ అనుములపురి రామకృష్ణను వారి చెర నుంచి విడిపించి తీసుకువచ్చారని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.
కౌన్సిలర్‌ను పంపించాలి
తమ పార్టీ కౌన్సిలర్ రామకృష్ణను టీఆర్‌ఎస్ నాయకులు వెంటనే తమ వద్దకు పంపించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు. టీఆర్‌ఎస్ నాయకులు రామకృష్ణను కిడ్నాప్ చేశారన్న సమాచారం మేరకు పలువురు సీపీఎం నాయకులు ఆ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కౌన్సిలర్‌ను పంపించాలని కోరినా పంపించకపోవడంతో వారు విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని టీఆర్‌ఎస్ నాయకులు బలవంతంగా తీసుకువచ్చారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పట్టణంలో ఇబ్బందికర రాజకీయాలు చేసేవారని, ఆయన దారిలోనే ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి జగదీష్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు మల్లు నాగార్జున్‌రెడ్డి, నూకల మధుసూదన్‌రెడ్డి, ఎల్గూరి గోవింద్, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, పల్లేటి వెంకన్న తదితరులు ఉన్నారు.
టీడీపీలో తేలని చైర్‌పర్సన్ అభ్యర్థి
చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీలో బుధవారం లొల్లి జరిగింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు మహిళలు బత్తుల ఝాన్సీరాణి, బూర సుష్మారాణి, నేరేళ్ల లక్ష్మి చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు. అయితే ఆ పార్టీ నాయకులు వారం రోజులపాటు సభ్యులను క్యాంప్‌నకు తరలించారు. తీరా ఎన్నిక వచ్చే సరికి ముగ్గురిలో ఎవరిని చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పార్టీ అధిష్టానం చైర్‌పర్సన్ అభ్యర్థిగా బత్తుల ఝాన్సీరాణిని ఎంపికచేస్తూ ప్రిసైడింగ్ అధికారికి నివేదిక అందించింది.
బీజేపీలో పదవి కోసం..
బీజేపీలో నుంచి నలుగురు కౌన్సిలర్లు గెలుపొందారు. పాలకవర్గం ఎన్నికలో టీడీపీ వారికి సహకరించేందుకు వీరు ఒప్పందానికి వచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. టీడీపీ వారికి చైర్‌పర్సన్ పదవి, బీజేపీకి వైస్ చైర్‌పర్సన్ పదవి ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ పదవిని గోదల భారతమ్మకు ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. చైర్‌పర్సన్ మహిళ ఉన్నప్పుడు వైస్ చైర్మన్ పదవిని పురుషులకు ఇవ్వాలని బీజేపీలోని కొందరు కౌన్సిలర్లు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానంతో రాజీ పడక మిగిలిన కౌన్సిలర్లు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.