
నిజాయితీ చాటుకున్న ప్రయాణికుడు
రామగుండం: ఏదైనా ఒక వస్తువు పోయిందంటే ఇకా మనది కాదని మరచిపోవాల్సిందే. కానీ తన తొటి ప్రయాణికుడు మరిచిపోయిన వస్తువులను అతని బంధువులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడో ఓ ప్రయాణికుడు. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్ళే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రామగుండంలో సీ అండ్ డబ్ల్యూ(రైల్వే)లో పనిచేస్తున్న రవి అనే వ్యక్తి రైలులో ప్రయాణిస్తున్నాడు.
అతనికి ఎదురు సీటులో కూర్చున్న వ్యక్తి జమ్మికుంట దాటిన తర్వాత కవర్‌ను సీటుపై ఉంచి వెళ్లిపోయాడు. ఆ కవర్‌లో సెల్‌ఫోన్, చార్జర్, రూ.2700 నగదు ఉన్నాయి. అతను బాత్ రూమ్‌కు వెళ్లి ఉండవచ్చని రవి భావించాడు. అతను అరగంట గడిచినా రాలేదు. రామగుండం స్టేషన్ రావడంతో ఆ కవర్‌ను తీసుకుని రవి అక్కడి జీఆర్పీ పోలీసులకు అప్పగించాలని ఈ విషయాన్ని రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు మోజెస్‌కు తెలిపాడు. అంతలో ఆ సెల్‌కి ఫోన్ రావడంతో మోజెస్ మాట్లాడి ఆ మహిళకు జరిగిన విషయాన్ని తెలిపారు.
ఆమె ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే తన సమీప బంధువైన శ్రీనివాస్ అనే వ్యక్తి విషయం చెప్పింది. దీంతో ఆయన రైల్వే స్టేషన్‌లో వీరిని కలిసి సెల్‌ఫోన్, నగదు మరిచిపోయిన వ్యక్తి ఉప్పల్‌కు చెందిన జవ్వాజి మోహన్‌గా తెలిపాడు. రవి,మోజెస్‌లు ఆ కవర్‌ను శ్రీనివాస్‌కు అప్పగించారు. తమ బంధువు మరిచిపోయిన వస్తువులను నిజాయితీతో అప్పగించడం పట్ల అతను వారికి కృతజ్ఞతలు తెలిపారు.