సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్‌మెంట్ తేలికైనా విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. అబుధాబి మాడ్యూల్‌కు సంబంధించిన ‘ఐసిస్ ద్వయం’అబ్దుల్లా బాసిత్, అబ్దుల్ ఖదీర్ మాత్రం ఈ వ్యవహారంలో తెలివిగా వ్యవహరించారు. సంప్రదాయేతర ‘విధ్వంస’ వనరులపై దృష్టి పెట్టారు. ఈ బాధ్యతల్ని సూత్రధారి బాసిత్ ప్రధాన అనుచరుడు ఖదీర్‌కు అప్పగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు గుర్తించారు.
శనివారం నగరంలో అరెస్టు చేసిన వీరిని సోమవారం ఢిల్లీలోని పాటియాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం 11 రోజులు (ఈ నెల 24 వరకు) పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఆర్డీ ఎక్స్, అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించే ప్రయత్నంలో నిఘాకు చిక్కే ప్రమాదం ఉం దని సాధారణ వస్తువులపై ఐసిస్ ద్వయం దృష్టిపెట్టింది. ఈ అంశంపై ఖదీర్ ఇంటర్‌నెట్‌లో సుదీర్ఘ అధ్యయనమే చేశాడు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి వీటిని సమీకరించాడు.
షహీన్‌నగర్‌లోని తన ఇంటితోపాటు తన బంధువు ఇంట్లోనూ వీటిపై ప్రయోగాలు చేశాడే కానీ, ఇంకా సఫలీకృతుడు కాలేదు. ఎన్‌ఐఏ అధికారులు ఇతడి ఇంటి నుంచి ఈ పదార్థాలతోపాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటినీ పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబోరేటరీకి పంపారు. ఇలాంటి పదార్థాలు మార్కెట్‌లో తేలిగ్గా దొరకడంతోపాటు ఎవరికీ అనుమానం రాదనే వీటిని ఎంపిక చేసుకున్నామని బాసిత్, ఖదీర్ ఎన్‌ఐఏకు తెలిపారు.
2014 నుంచి ఐసిస్ భావజాలం...
2014 నుంచి ఐసిస్ భావజాలంతో ఉండి, రెండుసార్లు దేశం దాటేందుకు యత్నించి చిక్కిన, ఇప్పటికీ రెండుసార్లు అరెస్టు అయిన అబ్దుల్లా బాసిత్‌కు ‘ఉగ్రస్ఫూర్తి’ఇచ్చింది అతడి సమీప బంధువు సలావుద్దీన్. నల్లగొండకు చెందిన సలావుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబై వెళ్లి అక్కడి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల నిర్వహణలో కీలకపాత్ర పోషించాడు. ఆపై రెండేళ్లపాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. 2001లో సిమిని కేంద్రం నిషేధించిన తరవాత సలావుద్దీన్ దుబాయ్‌కు మకాం మార్చాడు. 2011లో కేరళలో చిక్కిన ఇతడు 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాసిత్‌లో మార్పు తీసుకురావాలని కుటుంబీకులు ఓ యువతితో వివాహం చేసినా అతడిలో మార్పు రాలేదని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment