రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి...
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ రద్దుకు ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. రేవంత్కు బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి సహా ఉదయ సింహా, సెబాస్టియన్ లకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జైలు నుంచి విడుదలైన తర్వాత రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు.
రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో సహా.. ఇంకా ఇస్తానని చెప్పిన రూ. 4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం ఇంకా తేలాల్సి ఉందని, ఏ 4 జెరుసలేం మత్తయ్యను ఇంకా విచారించలేదని, నోటీసులు ఇచ్చిన వ్యక్తులు కూడా తమ ముందు హాజరుకాని దరిమిలా ఎవ్వరికీ బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అయితే కోర్టు మాత్రం నిందితులకు బెయిల్ మంజురు చేసింది.