
సండ్రకు మళ్లీ ఏసీబీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తానంటూ లేఖ రాయడంతోపాటు రెండు, మూడు రోజులుగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు శనివారం మరోసారి పిలుపు వచ్చింది. సోమవారం లోగా తమ ఎదుట హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న సండ్ర నివాసానికి నోటీసులు అతికించారు. అయితే ఈసారి సండ్రకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులిచ్చారు. ఇంతకు ముందు జూన్16న సండ్రకు ఏసీబీ సీఆర్‌పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) ప్రకారం నోటీసులు జారీ చేసింది.
అయితే అప్పట్లో తనకు ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి వచ్చినా.. లేదా పది రోజుల తర్వాత విచారణకు సహకరిస్తానంటూ జూన్ 19న ఆయన ఏసీబీకి లేఖ రాశారు. కానీ పదిరోజులు గడిచినా ఏసీబీ ఎదుటకు రాలేదు. హైకోర్టులో రేవంత్‌రెడ్డికి బెయిల్ వచ్చిన మరుసటి రోజు ‘విచారణకు పిలిస్తే వస్తా’ అంటూ ఏసీబీకి లేఖ రాశారు. అప్పటి వరకు కనిపించకుండా పోయిన సండ్ర బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ‘ఓటుకు కోట్లు’ కుట్రలో సండ్రకు భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ మొదటి నుంచి కూడా అనుమానిస్తోంది. అందుకు అనుగుణంగానే గతంలో సండ్రను సాక్షిగా పరిగణించిన ఏసీబీ ఈసారి నిందితుల జాబితాకు మార్చుకుంది. అందులో భాగంగానే తాజాగా సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది.