యాచారం:ఆసరాకు సంబంధించి మళ్లీ రీసర్వే చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తు బుధవారం చింతుల్ల గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు 500 మంది వరకు ఉండగా ప్రస్తుతం కేవలం 279 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు అయ్యాయన్నారు. పింఛన్లు కోల్పోయి అనేక మంది పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 50 మందికి పైగా లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.అంజయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి బ్రహ్మయ్య మాట్లాడుతూ... గ్రామంలో రీ సర్వే చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు. ఎంపీపీ రమావత్ జ్యోతి నాయక్ లబ్ధిదారుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. మళ్లీ రీ సర్వే చేయించి అర్వులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ ఉష దృష్టికి ఎంపీపీ తీసుకెళ్లారు. దీంతో శాంతించిన వారు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో చింతుల్ల సీపీఎం నాయకులు విజయ కుమార్, నర్సింహ, వెంటకయ్య తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల కోసం ఆందోళన
పెద్దేముల్: పింఛన్ల పంచాయతీ ఆగడం లేదు. రోజూ ఏదో గ్రామం నుంచి తమకు పింఛన్ రావడం లేదంటూ ప్రజలు కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని బుద్దారం, పెద్దేముల్ తదితర గ్రామాలకు చెందిన పలువరు వృద్ధులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. మూడు రోజుల నుంచి తిరుగుతున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పింఛన్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఈఓపీఆర్డీ సుహాసిని, పంచాయతీ కార్యదర్శులు విశ్వనాథం, అమృతలతో వాగ్వాదానికి దిగారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామంటూ అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి వెనుదిరిగారు.
‘ఆసరా’పై మళ్లీ సర్వే చేయాలి
Published Thu, Dec 18 2014 3:39 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
Advertisement