రష్‌గా ఉన్నా.. రాజాలా పోవచ్చు! | All vehicles moving through the road should go to Tollgate | Sakshi
Sakshi News home page

రష్‌గా ఉన్నా.. రాజాలా పోవచ్చు!

Published Fri, Jan 11 2019 1:35 AM | Last Updated on Fri, Jan 11 2019 1:35 AM

All vehicles moving through the road should go to Tollgate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సందడి అప్పుడే మొదలైంది. మరోవైపు నగరంలో సెటిలైన ఆంధ్ర, తెలంగాణ జిల్లాల ప్రజలు ఇప్పటికే ఊరుబాట పట్టారు. ఇలా నగరం నుంచి బయల్దేరే వాహనాలన్నీ నగరం సరిహద్దుల్లోని టోల్‌గేట్ల వద్దకు చేరుకుని విపరీతమైన రద్దీకి కారణమవుతున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఏటా సంక్రాంతి, దసరా సమయాల్లో ఇదే పునరావృతమవుతున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. ఫాస్టాగ్‌పై సరైన ప్రచారం నిర్వహించకపోవడంతో ఈసారి కూడా రద్దీ తప్పేలా లేదు. 

ఏంటి సమస్య? 
హైదరాబాద్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన ప్రజలు లక్షల్లో ఉన్నారు. వీరంతా దసరా, సంక్రాంతి సమయంలో ఊళ్లకు వెళతారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వాహనాలన్నీ టోల్‌గేట్లు దాటే వెళ్లాలి. ఒక్కసారిగా వాహనాలు బారులు తీరుతుండటంతో ఏటా సంక్రాంతి, దసరా, దీపావళి సమయాల్లో టోల్‌గేట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటోంది. శనివారం నుంచి సెలవులు మొదలవుతున్న దరిమిలా.. ఈ రద్దీ ఒక రోజు ముందుగా అంటే శుక్రవారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

కారణమేంటి?
తెలంగాణలో 18 టోల్‌గేట్లు ఉన్నాయి. వీటిలో 3 రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో, మిగిలిన 15 నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధీనంలో ఉన్నాయి. సెలవుల నేపథ్యంలో నగరవాసులు ఊళ్ల నుంచి తిరిగి వచ్చేక్రమంలో ఒక్కసారిగా టోల్‌గేట్లపై విపరీత మైన భారం పడుతోంది. ప్రతివాహనం టోల్‌ చార్జీ చెల్లించి, చలానా తీసుకుని వెళ్లాలి. ఇందుకు కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. చిల్లర సమస్య, కార్డులు పనిచేయకపోవడం వల్ల మరిం త జాప్యం జరగవచ్చు. శనివారం నుంచి నగరం నుంచి వెళ్లే రద్దీ రెట్టింపవనున్న నేపథ్యంలో టోల్‌గేట్ల నిర్వాహకులు అదనపు సిబ్బంది ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సమస్యకు కారణాన్ని విస్మరిస్తున్నారు.

ఫాస్టాగ్‌పై ప్రచారం ఏది..? 

ప్రతిసారీ టోల్‌గేట్‌ వద్ద ఆగి రుసుము చెల్లించకుండా ఎన్‌హెచ్‌ఏఐ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ సిస్టం (ఈటీసీఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఫాస్టాగ్‌ డివైజ్‌లను వాహనాలకు ముందుభాగాల్లో అమరుస్తారు. ముందుగానే రీచార్జ్‌ చేసుకుంటే.. టోల్‌గేట్ల వద్ద సెన్సార్లు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వీటిని గుర్తిస్తాయి. రుసుము ఆటోమేటిక్‌గా కట్‌ అయిపోయి, గేటు సులువుగా తెరుచుకుంటుంది. దీనివల్ల ప్రతి వాహనానికి దాదాపు 5 నిమిషాల సమయం మిగులుతుంది. ఇది ఇటు వాహనదారుడికి, అటు టోల్‌ నిర్వాహకులకు అనుకూలంగా ఉంటుంది. పైగా ట్రాఫిక్‌ సమస్యలకు, చిల్లర సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే ఫాస్టాగ్‌లపై 50 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిపై అవగాహన లేని వాహనదారులు డబ్బులు, కార్డుల ద్వారా చెల్లించేందుకే అధికశాతం మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో సొంత వాహనాలు పెరుగుతున్న దరిమిలా వీటిపై కావాల్సినంత ప్రచారం జరగడం లేదన్నది వాస్తవం. 2017 చివరినాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసినప్పటికీ ఇది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. 

ఆర్టీసీ  ఎందుకు  బిగించు కోవడం  లేదు.. 
ఆర్టీసీ బస్సులు కూడా టోల్‌గేట్‌ ట్రాఫిక్‌ జాముల్లో చిక్కుకుపోతున్నా సమస్యకు పరిష్కారం దిశగా చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫాస్టాగ్‌ పరికరాలుబిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని టోల్‌గేట్లలోనూ ఫాస్టాగ్‌ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. అయితే, ఆర్టీసీ అధికారుల వాదన మరో రకంగా ఉంది. ఒక్కసారి ఈ డివైజ్‌ను బిగిస్తే అందులో వాహనం వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు నిత్యం వేర్వేరు రూట్లలో తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బస్సులకు ఫాస్టాగ్‌ పరికరాల బిగింపు కార్యరూపం దాల్చడం లేదు. టీఎస్‌ఆర్టీసీ నగరం నుంచి 5,252 బస్సులువేసింది, ఇందులో 1,500 ఏపీకి వెళ్తాయి. వీటన్నింటిలో ప్రయాణించే వారంతా టికెట్‌ రేటుతోపాటు టోల్‌ కూడా చెల్లించాల్సిందే. దీంతో ఈసారి కూడా ఆర్టీసీ బస్సులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పేలా లేవు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement