గేట్‌ వే ఆఫ్‌ అమెరికా.. అమీర్‌పేట | Ameerpet Coachig Centers Special Story | Sakshi
Sakshi News home page

గేట్‌ వే ఆఫ్‌ అమెరికా.. అమీర్‌పేట

Published Thu, Aug 22 2019 10:50 AM | Last Updated on Sat, Aug 31 2019 12:16 PM

Ameerpet Coachig Centers Special Story - Sakshi

గత పదేళ్లతో పోలిస్తే ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసి బయటకు వస్తున్న వారి సంఖ్య 10 రెట్లు పెరిగింది. క్యాంపస్‌ స్థాయిలోనే ప్లేస్‌మెంట్‌ దక్కితే సరి.. లేదంటే అమీర్‌పేటను నమ్ముకోవాల్సిందే. ఇంజినీరింగ్‌ చదివి బయటకు వచ్చే ఏ ఫ్రెషర్‌ అయినా అమీర్‌పేటలో కాలుమోపిన తర్వాతే మరెక్కడికైనా వెళ్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడ శిక్షణ సంస్థలు అందించే కోర్సుల్లో కాసింత జ్ఞానం సంపాదించుకుంటే ఉద్యోగంలో రాణించవచ్చని, ఉపాధి పొందవచ్చనే భరోసాను కల్పించడమే కారణం. అందుకేనేమో అమీర్‌పేటకు గేట్‌ వే ఆఫ్‌ అమెరికా అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.  దేశంలో ఎక్కడా దొరకని టెక్నాలజీ కోర్సులు ఇక్కడ లభించడం విశేషం.   

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ...
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ కోర్సులైన జావా, ఫైతాన్, లిస్ప్, ప్రోలాగ్, సీ++ తదితర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్, ఒరాకిల్, డాట్‌నెట్, జావా వంటి పరిమిత బేసిక్‌ కోర్సులే ఒకప్పుడు ఎక్కువగా వినిపించేవి. ఆ తర్వాత ఆయా టెక్నాలజీలో వచ్చిన అధునాతన మార్పులను అందిపుచ్చుకుంటూనే ప్రస్తుతం రాజ్యమేలుతున్న క్లౌడ్‌ ఆధారిత టెక్నాలజీ కోర్సుల వరకు ఎప్పటికప్పుడు శిక్షణ కేంద్రాలు పదునుపెట్టుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా క్లౌడ్‌ సర్వీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో అమీర్‌పేటలో ఆయా టెక్నాలజీ కోర్సులకు ఎక్కడా లేని ప్రాధాన్యం సంతరించుకుంది.   

పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి..
కోర్సుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని లక్షల ప్యాకేజీలకు ‘సాఫ్ట్‌’గా విద్యార్థులు ఎగిరిపోవడమే కాదు.. ఇక్కడ శిక్షణ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది మాట అలా ఉంచితే.. వీటిని నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్‌భండార్, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హాస్టళ్లు, సాఫ్ట్‌వేర్‌ కోర్సుల మెటీరియల్‌ విక్రయ కేంద్రాలు, ట్రావెల్‌ ఏజెన్సీలు తదితర సంస్థల నిర్వాహకులు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. 

500 పైచిలుకు శిక్షణ సంస్థలు..
రెండు దశాబ్దాల క్రితం వేళ్ల మీద లెక్కించేంత సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రాలకు మాత్రమే అమీర్‌పేట పరిమితంగా ఉండేది. మొదట అమీర్‌పేటలోనే సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) కార్యాలయం ఉండేది. కాలక్రమంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు హైటెక్‌ సిటీకి వెళ్లిపోగా ఇక్కడ కోచింగ్‌ సెంటర్ల హవా మొదలైంది. అమీర్‌పేట మైత్రీవనం, ఆదిత్య ట్రేడ్‌ సెంటర్, సత్యం టాకీస్‌ రోడ్డు, గురుద్వారా రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 500 వరకు శిక్షణ సంస్థలు ఆయా కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ కోర్సులను కూడా అందిస్తున్నాయి.  

ఖర్చు తక్కువ..
బెంగళూరు, చెన్నైలతో పాటు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ‘సాఫ్ట్‌’ కోర్సుల్లో శిక్షణకయ్యే ఖర్చు ఇక్కడ చాలా తక్కువ. దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు దక్షిణాఫ్రికా, దుబాయ్, అబుదాబి తదితర దేశాలకు చెందిన విద్యార్థులు సైతం అమీర్‌పేట శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటుంటారు.   గడిచిన రెండు దశాబ్దాల్లో అమీర్‌పేటలో కాలుపెట్టి అమెరికా వెళ్లినవారు   అందుకే గేట్‌ వే ఆఫ్‌ అమెరికా.. అమీర్‌పేట అన్న పేరును సార్థకం చేసుకుంది.  

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌.. 
మార్కెట్లోకి వచ్చే ఏ కొత్త టెక్నాలజీకి సంబంధించిన కోర్సయినా మొదట అమీర్‌పేట శిక్షణ కేంద్రాల్లో ఉండాల్సిందే. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనే ఆశలను నెరవేర్చేందుకు ఇక్కడ శిక్షణ సంస్థలు టెక్నాలజీ కోర్సులను అప్‌డేట్‌ చేసుకుంటూనే ఉంటాయి.     – ఎన్‌.కోటి,ఆపరేషన్స్‌ హెడ్, పీర్స్‌ టెక్నాలజీస్‌

భవితకు భరోసా
ప్రస్తుతం మార్కెట్లో ఏడబ్ల్యూఎస్‌కు మంచి డిమాండ్‌ ఉంది. నేను ఈ కోర్సులో శిక్షణ పొందాను. ఫీజు కూడా ఎంతో రీజనబుల్‌గా ఉన్నాయి. అనుకున్న సమయంలో కోర్సులు పూర్తి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత.    – గోపీకృష్ణ, ఇంజినీరింగ్‌ విద్యార్ధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement