
సాక్షి, హైదరాబాద్: రోజుకు ఇద్దరు అమ్మాయిల చొప్పున అదృశ్యమవుతున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో రెండేళ్లలో 4 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, ఆర్టీసీ టికెట్ల పెంపు తదితర అంశాలపై భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ గురువారం ప్రత్యేకంగా సమావేశమయింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘దిశ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితులకు ఉరిశిక్ష పడాలి. అసిఫాబాద్, వరంగల్ ఘటనలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ప్రధాన కారణం అదే..
‘వీటికి ప్రధాన కారణం మద్యం. వీటిని విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు, హైవేలపై మద్యం అమ్మకాలు నేరస్థులకు తోడ్పడుతున్నాయి. నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం ఆదాయం వస్తే చాలు అన్న రీతిలో నడుచుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నియంత్రణలో ఉండాలి. బెల్ట్‌షాపులు, పర్మిట్ రూమ్‌లను మూసేయాలి. ఏదైనా స్టేషన్‌లో ఎవరైనా కేసు పెట్టాలన్నా, ఎత్తివేయాలన్నా టీఆర్‌ఎస్ నాయకుల నుంచే ఆదేశాలు వస్తున్నాయి. పోలీసు యంత్రాంగం ఉన్నది టీఆర్‌ఎస్ నాయకుల కోసం కాదు.. ప్రజల కోసం’ అని విక్రమార్క మండిపడ్డారు. ఆర్టీసీ టికెట్ల చార్జీల పెంపుపైనా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలపై రూ. 1000 కోట్ల భారం వేయడం చూస్తుంటే ఆయన చెప్పేదాంట్లో ఏది నిజమో అర్థం కావడం లేదని ఎద్దేవా భట్టి విక్రమార్క చేశారు.