
బీహెచ్‌ఈఎల్‌తో జెన్‌కో ఎంవోయూ
తెలంగాణలో విద్యుదుత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విద్యుదుత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుమారు 6వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా భారీ థర్మల్ పవర్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)తో తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీహెచ్‌ఈఎల్ సీఎండీ బి.ప్రసాదరావు, జెన్‌కో ఎండీ డి.ప్రభాకరరావు ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఖమ్మంలోనే ఎక్కువ ప్లాంట్లు
బీహెచ్‌ఈఎల్, జెన్‌కోల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. రానున్న మూడేళ్లలోగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, కరీంనగర్ జిల్లా రామగుండంలలో ఈ ప్లాంట్ల నిర్మాణం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణ పూర్తయ్యాక ఏ ప్రాంతంలో ఎంత సామర్థ్యం కలిగిన ప్లాంట్లను నెలకొల్పాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిన మూడేళ్లలో ఈ పవర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటికే తెలంగాణలో భూపాలపల్లి, సింగరేణి కాలరీస్, కొత్తగూడెంలలో ప్లాంట ్లను సమర్థవంతంగా నెలకొల్పిన బీహెచ్‌ఈఎల్, వచ్చే మూడేళ్లలో కొత్తగా చేపడుతున్న విద్యుత్ ప్లాంట్లను పూర్తి చే యగలదని సీఎం కేసీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగరావు, ఎస్.కె.జోషి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.
2 వేల మెగావాట్ల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను నివారించేం దుకు 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి దీర్ఘకాల ప్రాతిపదికన బిడ్లను ఆహ్వానించాలని, వీలైనంత త్వరగా విద్యుత్‌ను కొనుగోలు చేయూలని ఆయున ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి జోషికి సూచించారు.