క్రీడా‘తారలు’
నగరానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం... వీరిలో కొందరి జీవిత విశేషాలు ఒక పూర్తి స్థాయి సినిమాను తలపించే రీతిలో ఉండడం మనకు తెలిసిందే. రన్నింగ్‌లో నేషనల్ ఛాంపియన్ మిల్కాసింగ్ కథతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’తో పాటు బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం కూడా విజయవంతమయ్యాయి. దీంతో నగరం వేదికగా ఎదిగిన క్రీడాకారులు కూడా తమ ‘జీవితం’తెరకెక్కాలని కోరుకుంటున్నారు. వీరిలో కొందరిని సినిమా రూపకర్తలే సంప్రదిస్తుండగా... కొంతమంది తామే చొరవ తీసుకుని లైఫ్‘షో’కి సై అంటున్నారు. దీంతో స్పోర్ట్స్‌స్టార్స్ బయోపిక్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
- బయోపిక్స్‌పై స్పోర్ట్స్‌స్టార్‌ల ఆసక్తి
- ‘అజహర్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల
- తెరపైకి మరికొందరి జీవితాలు?
వెండితెర ఇప్పుడు క్రీడాకారుల జీవిత విశేషాలకు వేదికవుతోంది. క్రీడాతారల జీవిత విశేషాలతో రూపొందిన కథలకు ఆదరణ లభిస్తుండడంతో... మరికొన్ని చిత్రాలు వరుసలోకి వస్తున్నాయి. దీనికి స్టార్ ఆటగాళ్లు సైతం పచ్చజెండా ఊపుతున్నారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ పాత్రలలో ఏ హీరో, హీరోయిన్లు తెరపై కనిపిస్తే బాగుంటుందో సూచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్ జీవితం తెరపైకి వస్తున్న నేపథ్యంలో...మిగిలిన కథలూ ‘క్యూ’లో ఉన్నాయి. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ క్రీడాతారల జీవితంలోని ఘట్టాల గురించి తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది.
సానియా... ఎవరయా?
నగరంలో పుట్టి నాజర్ స్కూల్లో చదివి... తెలుగు రాష్ట్రాల్లో టెన్నిస్ క్రీడకు వెలుగు తెచ్చిన అసమాన క్రీడాకారిణి సానియా మీర్జా. ఆటలో అంతర్జాతీయ కీర్తి గడించిన ఈ సిటీ స్టార్... అందం... ఫ్యాషన్ స్టైల్స్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్‌మాలిక్‌తో ప్రేమ పెళ్లి ద్వారా మీడియాకు కావాల్సినంత మసాలా అందించిన సానియా జీవితం కూడా విశేషాల మయమే. ఎంతో మంది సినిమాల్లో నటించాలనిఅడిగినా ‘నో’ చెప్పిన సానియా... తన జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి మాత్రం ఇటీవలే ఓకే చెప్పారు. మరుక్షణం నుంచి తన బయోపిక్ రూపొందించేందుకు టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వినికిడి. సానియా కథతో తీసే సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు పలువురి పేర్లు ప్రస్తావనకు వస్తుంటే... తన పాత్ర పోషించాలంటే ప్రస్తుత నటీమణుల్లో దీపికా పదుకొనెమాత్రమే సరైన ఎంపిక అని... తన భర్త షోయబ్ పాత్రకు సల్మాన్‌ఖాన్‌ను సూచించడం ద్వారా సానియా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఇక ఈ బయోపిక్ తెరకెక్కడమే తరువాయి.
వెండితెర ‘చంద్’మామ
అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన బయోపిక్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ది. నగర వాసిగా బ్యాడ్మింటన్ రంగంలో రాణించడం మాత్రమే కాకుండా సైనా నెహ్వాల్ లాంటి నెంబర్‌వన్ క్రీడాకారిణిని తీర్చిదిద్ది... నగరానికి మరిన్ని క్రీడారంగ విజయాలు దక్కేలా చేసిన గోపీచంద్ బయోపిక్ ఇప్పుడు వార్తల్లో అంశం. సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు, హీరో సుధీర్‌బాబు (ప్రేమ కథా చిత్రం ఫేం) ఈ సినిమాలో గోపీచంద్ పాత్రలో నటి స్తున్నారు. వ్యక్తిగతంగా గోపీచంద్‌కి స్నేహితుడైన సుధీర్‌బాబు... ఈ సినిమా పట్ల అత్యంత ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం త్వరలోనే పట్టాలకెక్కనుంది.
సై... అంటూ..
బ్యాడ్మింటన్ స్టార్‌గానూ, గ్లామర్, స్టైల్స్‌నూ పండిస్తూ... మన సిటీ వేదికగా రాణిస్తున్న నగర క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం తన బయోపిక్ రూపకల్పనపై ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్‌గా వెలుగొందుతున్న ఈ సిటీ స్టార్... గతంలో బ్యాడ్మింటన్ ఆడిన అనుభవమున్న దీపికా పదుకొనె తన పాత్ర పోషిస్తే బాగుంటుందని... హీరోగా షారూఖ్ తన ఛాయిస్ అంటున్నారు. వ్యక్తిగతంగా తనను కాక బ్యాడ్మింటన్‌ను ప్రమోట్ చేసేలా ఆ సినిమా ఉండాలంటున్న సైనా.. మిగలిన క్రీడా నేపథ్యాల నుంచి వచ్చిన సినిమాల్లా కాక... తన సినిమా తీసేవారికి ఆటలో సాంకేతిక అంశాలపై కూడా పట్టుంటేనే... అది లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.
అజహర్‌గా ఇమ్రాన్
మహ్మద్ అజహరుద్దీన్. క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే మన నగరవాసి. క్రికెట్ క్రీడాకారుడిగా, భార త టీమ్ కెప్టెన్‌గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. ఇక్కడే పుట్టి... ఇక్కడే చదువుకుని... ఇక్కడే ఎదిగిన ఈ హైదరాబాదీ...ప్రస్తుతం పొలిటీషియన్‌గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్‌గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్స్‌ర్‌గా ఆరోపణలతో అటు క్రీడా జీవితంలో... పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ... పెళ్లి... మళ్లీ.. విడాకులు... ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం... ఇలా వ్యక్తిగత జీవితంలోనూ రకరకాల సవాళ్లను ఎదుర్కొన్న అజహర్ కథ... ఒక కలర్‌ఫుల్ సినిమాకు అవసరమైన అద్భుత ముడిసరుకు. ప్రస్తుతం ఏక్తాకపూర్ నిర్మాతగా ‘అజహర్’ పేరుతో రూపొందుతున్న బయోపిక్‌లో హిందీ హీరో ఇమ్రాన్‌హీష్మి నటిస్తున్నాడు. సంగీతా బిజిలానీతో ప్రేమ వ్యవహారానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఇటీవలే దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.