‘తిరంగా’కు మతం రంగు వద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడిన అంశాల గురించి తిరంగాయాత్ర ద్వారా బీజేపీ కార్యక్రమాల ను చేపడుతుంటే, అధికార టీఆర్‌ఎస్ నేతలు.. వాటికి మతం రంగుపులిమి, చరిత్ర ను వక్రీకరిస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య పాలనకోసం నాడు నిజాం రాచరిక వ్యవస్థపై ఇక్కడి ప్రజలు పోరాటం చేశారన్నారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నాడు తెలంగాణ విమోచన కోసం పోరాడిన వారి త్యాగాలు స్మరించుకొనే వీలులేకుండా పో యిందన్నారు.
సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17పై తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చెబుతున్న మాటలకు పొంతన లేదన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వ ద్వంద్వ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విమోచన ఉత్సవాలపై తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ ఉత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రజాకార్ల వారసత్వంగా వచ్చిన ఎంఐఎంతో అంటకాగుతోందన్నారు. తిరంగాయాత్ర సందర్భంగా భైంసాలో తమ కార్యకర్తలపై కేసులు పెట్టారని, రామగుండంలోనూ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
గోల్కొండలో నిర్వహించాలి...
గోల్కొండ కోటలో సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. కేంద్రం కూడా ఈ ఉత్సవాలను అధికారికం గా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ స్టేట్‌ను పాకిస్తాన్‌లో కలపాలని నాడు నిజాం చేసిన ప్రయత్నాలను కేసీఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది తెలంగాణ విమోచనకు 70 ఏళ్లు నిండుతున్నందున ఈ సెప్టెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది వరకు ఉత్సవాలను నిర్వహించేలా కమిటీ వేయాలన్నారు.