బకాయిల తెలంగాణగా మార్చొద్దు
బడ్జెట్‌పై చర్చలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయడం సంగతేమోగానీ, బకాయిల రాష్ట్రంగా మాత్రం మార్చొద్దని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రభుత్వానికి సూచించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనమండలిలో మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన రుణాలు భవిష్యత్తులో ప్రజలకు భారంగా పరిణమించకూడదని సూచించారు. గత మూడేళ్లుగా బడ్జెట్ అంచనాలకు, వ్యయానికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని పేర్కొన్నారు.
2016–17 బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల్లో నీటిపారుదలకు 39 శాతం, సాంఘిక సంక్షేమానికి 51 శాతం, పంచాయతీరాజ్‌లో 34.7 శాతం, పాఠశాల విద్యలో 4 శాతం నిధులు ఖర్చు చేయలేదన్నారు. యూపీలో రైతు రుణమాఫీకి కేంద్రం నిధులిస్తే రాష్ట్రానికి కూడా నిధులివ్వాలని కేంద్రాన్ని అడిగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మజ్లీస్ ఎమ్మెల్సీ రజ్వీ మాట్లాడుతూ.. మైనార్టీలకు గత బడ్జెట్లో కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదన్నారు.