అబద్ధాల కనికట్టు: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, అబద్ధాల కనికట్టు అని బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బడ్జెట్‌పై అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. కీలకరంగాలను నిర్లక్ష్యం చేస్తూ, ప్రధానమైన అంశాలకు నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో ఒక పక్క తీవ్ర కరువు పరిస్థితులు, మరో పక్క రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే వ్యవసాయరంగాన్ని బడ్జెట్‌లో నిర్లక్ష్యం చేశారన్నారు. ఇప్పటిదాకా ఆర్భాటంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ విద్యను ఎందుకు ప్రారంభించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు.
వైద్యరంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యంచేశారని అన్నారు. గొప్పలకు పోయి రాష్ట్ర బడ్జెట్‌ను అంకెల్లో భారీగా పెంచి చూపిస్తున్నారని విమర్శించారు. బడ్జెట్‌లో చూపించిన లెక్కలకు, వాస్తవంగా ఖర్చు చేస్తున్న నిధులకు భారీ వ్యత్యాసముందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబల్ బెడ్‌రూముల ఇళ్లు వంటి ముఖ్యమైన పథకాలను బడ్జెట్‌లో ప్రస్తావించకుండా నిధులను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పథకాలను ప్రకటించడం, అప్పులు తెస్తామని చెప్పడం తప్ప ఈ బడ్జెట్‌లో ఏముందని ప్రశ్నించారు. అప్పులను పెంచుకుంటూ పోతే దానికి బాధ్యులెవరు అని లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధికోసం రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిందేమీ లేదన్నారు. అంకెలగారడీ, మాయమాటలతో రాష్ట్ర ప్రజలను ఈ బడ్జెట్ ద్వారా మరోసారి మోసం చేశారని విమర్శించారు.