- ఇక అభివృద్ధి వేగిరం..!
- హోం,రెవెన్యూ,ఎక్సైజ్ శాఖల మంత్రులుగా నగర నేతలు..
సాక్షి, సిటీబ్యూరో: నూతనంగా కొలువుదీరిన కే చంద్రశేఖరరావు సర్కార్‌లో నగరానికి సముచిత ప్రాధాన్యం దక్కింది. ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖను ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి, హోం శాఖ పగ్గాలు సీనియర్ నేత నాయినికి, ఎక్సైజ్‌శాఖను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో నగరాభివృద్ధిపై ఆశలు రేకెత్తుతున్నాయి.
తాజా మంత్రివర్గ కూర్పును పరిశీలిస్తే.. పార్టీ ఆవిర్భావం నుంచి అంకితభావంతో పనిచేయడంతో పాటు పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు తనకు వెన్నంటి నిలిచిన ముఖ్య నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా మంత్రివర్గంపై కేసీఆర్ మార్క్ సుస్పష్టంగా కనిపించింది. నగరానికి హోంశాఖ దక్కడం ద్వారా గ్రేటర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలపై దాడుల నిరోధం, నేరాల రేటును తగ్గించడం, ఐటీ, పారిశ్రామిక కారిడార్లలో పటిష్ట రక్షణ, అభయ వంటి అకృత్యాలు పునరావృతం కాకుండా చూసే క్రమంలో భద్రతకు పెద్దపీట పడనుంది.
ఈ తరుణంలో సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నాయినికి హోం పగ్గాలు అప్పజెప్పడం ద్వారా నగరంలో శాంతి భద్రతలకు ఢోకాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కీలకమైన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ పగ్గాలు మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీకి అప్పగించడంపై ఆ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మహానగరం పరిధిలో నిజాం కాలం నాటి వక్ఫ్, సర్ఫేఖాస్, ఇనాం భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఆయనకు రెవెన్యూ బాధ్యతలు అప్పగించడంతో వీటి పరిరక్షణకు ప్రాధాన్యం దక్కుతుందని మైనార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం గల ఎక్సైజ్ శాఖను సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్‌కు అప్పగించడం విశేషం. ఆయన సారథ్యంలో నూతన ఆబ్కారీ విధానానికి శ్రీకారం చుడతారని భావిస్తున్నారు.
గతంలోనూ నగరానికి కీలక శాఖలు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసిన ప్రభుత్వాల్లో నగరానికి చెందిన కొందరు నాయకులకు కీలక శాఖలు దక్కాయి. మలక్‌పేట నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన కోహెడ ప్రభాకర్‌రెడ్డి 70వ దశకంలో కీలకమైన హోంశాఖ పగ్గాలు చేపట్టారు. ఆయన తరవాత దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్‌లో మైనార్టీ వర్గానికి చెందిన హాషం కూడా హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.