మిన్నంటిన రోదనలు
నిజామాబాద్ క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో గురువారం ఉదయం బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తున్న మహిళ ఆటో ఎక్కేందుకు బస్టాండ్ బయటకు వస్తుండగా బస్సు లోపలకు వెళ్తూ ఆమెను ఢీకొట్టింది. బస్సు ముందు చక్రం ఆమె ముఖంపై నుంచి వెళ్లటంతో ముఖం నుజ్జునుజ్జు అయింది. ఒకటవ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన మాధవి(34) బాసర త్రిపుల్ ఐటిలో అవుట్‌సోర్సు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. ఈమెకు 13 సంవత్సరాల క్రితం ఆర్మూర్ మండలం మునిపల్లి గ్రామానికి చెందిన రమేష్‌తో వివాహం అయింది.
వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. భర్త రమేష్ బతుకుదెరువు కోసం దుబయ్ వెళ్లాడు. దీంతో ఆమె బాసర త్రిపుల్ ఐటీలో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు మునిపల్లికి వచ్చిపోతుండేది. ఇలా మునిపల్లికి వెళ్లేందుకు గురువారం ఉదయం సోదరుడు మహేష్‌తో కలిసి నిజామాబాద్‌కు వచ్చింది. బస్సు దిగి ఆటో ఎక్కేందుకు బయటకు వస్తుండగా బస్టాండ్ గేట్ వద్ద హైదరాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తున్న ఏపీ 29జెడ్2671 నంబరు గల బోధన్ డిపోకు చెందిన బస్సు లోపలకు వస్తూ ఢీకొట్టింది. అప్పటి వరకు తనతో పాటు ఉన్న చెల్లెలు కళ్లముందే ప్రాణాలు కోల్పోవటంతో మహేష్ ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు.
విషయాన్ని కుటుంబ సభ్యులకు చెరవేయటంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తూ అక్కడికి చేరుకున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన ఆర్‌టీసీ డ్రైవర్ బస్సును అక్కడే వదిలి పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఒకటవ టౌన్ పోలీసులు బస్టాండ్‌కు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి కానరాని లోకానికి వె ళ్లిపోవటం, తండ్రి బతుకుదెరువు కోసం దుబాయిలో ఉండటంతో పిల్లలను సముదాయించటం ఎవరి వల్లా కాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మునిపల్లి గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విచారణ అనంతరం చర్యలు
నిజామాబాద్ నాగారం : బస్టాండ్‌లో గురువారం ఉ దయం బస్సు ఢీకొని మహిళ మృతిచెందిన ఘట నపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే సంబంధిత డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని బోధన్ డిపో మేనేజర్ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేస్తారని, వారిచ్చే ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకు డ్రైవర్‌కు విధు లు కేటాయించకుండా స్పేర్‌లో పెడతామన్నారు. ఆ డ్రైవర్ 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడని, తన డ్యూటీలో ఇదే మొదటి ప్రమాదమని తెలిపారు.
బస్టాండ్‌లో బస్సు ఢీకొని మహిళ మృతి
Published Fri, Feb 27 2015 3:57 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement