కారడవుల్లో సీసీ కెమెరాలు.. నీటి మడుగుల వద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్.. సీసీఎంబీలో పెంటిక పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా పులుల లెక్కింపు.. తెలంగాణలో తొలిసారి గణన
సాక్షి, హైదరాబాద్ :పులులుండేది నట్టడవిలో.. ఎక్కడ తిరుగుతాయో.. ఎప్పుడు పొదల్లోంచి బయటకొస్తాయో ఎవ్వరికీ తెలియదు! అయినా నల్లమలలో ఇన్ని పులులున్నాయి.. కవ్వాల్ అడవుల్లో అన్ని పులులు ఉన్నాయి.. ముడుమలై జంగల్‌లో ఇన్ని ఉన్నాయని అటవీ శాఖ అధికారులు ఎలా చెబుతారు? సహజంగా అందరికీ కలిగే ప్రశ్నే ఇది! కానీ పులుల గణన అత్యంత పక్కాగా, పూర్తి శాస్త్రీయంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో ప్రతి నాలుగేళ్లకోసారి వారం రోజులపాటు అన్ని రాష్ట్రాల్లో పులులను లెక్కిస్తారు. చివరిసారిగా 2014 జనవరిలో లెక్కించారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటిసారి తెలంగాణలో కూడా పులులను గణించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు పులులను ఎలా లెక్కిస్తారు? అందుకు ఏ విధానాలను అనుసరిస్తారో ఓసారి చూద్దాం..
ఈసారి ఫేజ్–4 మానిటరింగ్..
దేశవ్యాప్తంగా ఏడురోజులపాటు ఏకకాలంలో పులుల గణన చేపడతారు. ఇందులో మూడు రోజులు వేటాడే జంతువులు (మాంసాహారులు), మరో మూడు రోజులు శాకాహార జంతువుల వివరాలు సేకరిస్తారు. ఇంతకుముందు పాదముద్రల ఆధారంగా పులులను లెక్కించేవారు. ఇప్పుడు నాలుగు దశల్లో గణించేందుకు ‘ఫేజ్–4 మానిటరింగ్’ విధానాన్ని అనుసరించేందుకు అటవీ శాఖ సన్నద్ధమవుతోంది. అంటే ఛాయా చిత్రాలు, పాదముద్రలు, పెంటిక పరీక్ష, భౌతికంగా గమనించటం అనే నాలుగు అంశాల ఆధారంగా పులిని గుర్తిస్తారు. పులుల్లో పాద ముద్రలు, చారలు వేర్వేరుగా ఉంటాయి. ఒక పులిచారలు, పాదముద్రలు ఎట్టి పరిస్థితుల్లో వేరే పులితో సరిపోలవు.
సీసీ కెమెరాలే కీలకం..
పులుల లెక్కింపులో సీసీ కెమెరాలే కీలకం. నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిమాణం 2 వేల చదరపు కిలోమీటర్లు. పులుల గణన కోసం 400 చ.కి.మీ. దూరాన్ని ఒక బాక్స్‌గా తీసుకుంటారు. దీన్ని మళ్లీ సబ్ బాక్స్‌గా విభజిస్తారు. ప్రతి సబ్ బాక్స్ 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. ఈ లెక్కన 400 చ.కి.మీ.లకు 100 బాక్స్‌లవుతాయి. ప్రతి బాక్స్‌కు ఏదో ఒకచోట ఒక జత డిజిటల్ కెమెరాలను అమరుస్తారు. నేలకు ఒకటిన్నర ఫీట్ల నుంచి 2 ఫీట్ల ఎత్తులో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తారు. కదిలే జంతువు వాటి సమీపంలోకి రాగానే అందులోని కెమెరా క్లిక్ మంటుంది. ఇలా ఫొటోలను సేకరించి వాటిలో నమోదైన పులుల చారలను పరిశీలిస్తారు. చారల్లో ఉండే తేడాల ఆధారంగా ఒక ఫోటోను మరో ఫోటోతో సరిపోల్చుతూ పులుల సంఖ్యపై ఓ అంచనాకు వస్తారు. ఒక ప్రాంతంలో సేకరించిన చిత్రాలన్నింటిలో ఒకే తరహా చారలు ఉంటే అక్కడ ఒకే పులి సంచరిస్తుందని, ఒకవేళ చారలు సరిపోలక పోతే రెండో పులి కూడా ఉందని నిర్ధారిస్తారు.
ప్రతి పులికీ ఓ నంబర్..
గుర్తించిన ప్రతి పులికి ఒక నంబర్ ఇస్తారు. ఒకరకంగా ఆ నంబరే పులి పేరుగా అనుకోవచ్చు. ఉదాహరణకు నాగర్‌కర్నూలు జిల్లా మన్ననూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఒక మగ పులిని గుర్తించి దానికి టీఎంఎన్‌ఆర్‌డీ ఎం1 అనే నంబర్ కేటాయించారు. ఇందులో టీ అంటే తెలంగాణ, ఎంఎన్‌ఆర్ అంటే మన్ననూర్, డీ అంటే డివిజన్, ఎం అంటే మేల్, 1 అంటే ఒకటో పులి అని అర్ధం. ఇక ఈ పులి దేశంలో ఏ అడవికి వెళ్లినా వెంటనే గుర్తిస్తారు. ఇలా ఒక ఆవాసంలో ఎన్ని పులులు కనిపిస్తే అన్ని నంబర్లు కేటాయిస్తారు. పులుల లెక్కలు సేకరించేటప్పుడు రెండేళ్ల లోపు కూనలను పరిగణనలోకి తీసుకోరు.
పాదముద్రలు సేకరిస్తారిలా..
పులి సాధారణంగా చదునైన దారి మీదే రాకపోకలు సాగిస్తుంది. బలంగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. దాని పాదం పడిన చోట కచ్చితంగా ముద్రలు పడుతాయి. ఏ రెండు పులుల పాదం ముద్రలు ఒకేలా ఉండవు. నీటి మడుగుల సమీపంలో చదునైన బాటపై అధికారులు పచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పలకాలు పెడతారు. నీళ్ల కోసం వచ్చిన పులి పలకాల మీద కాలు పెడితే అచ్చులు పడుతాయి. వాటి ఆధారంగా పులల సంఖ్యను నిర్ధారిస్తారు.
సీసీఎంబీలో పెంటిక పరీక్ష
పులులు సంచరించే ప్రాంతంలో పెంటికల(పేడ) నమూనాలు సేకరిస్తారు. అదే రోజు లేదా రెండు, మూడ్రోజుల కిందట విసర్జితమైన పెంటికలను మాత్రమే సేకరిస్తారు. ఇలా వరుసగా మూడు, నాలుగు రోజులపాటు 10 నుంచి 15 పెంటిక శాంపిల్స్‌ను సేకరించి సీసీఎంబీకి పంపుతారు. అక్కడ డీఎన్‌ఏ పరీక్షలు చేస్తారు. సేకరించిన అన్ని నమూనాల్లో ఒకే రకమైన డీఎన్‌ఏ ఉంటే పెంటికలు అన్ని ఒకే పులివి అని నిర్ధారిస్తారు. డీఎన్‌ఏలలో తేడా ఉంటే మరో పులి ఉన్నట్లు గుర్తిస్తారు.
లెక్కలకు సిద్ధమవుతున్నాం: శంకరన్, వన్యప్రాణి విభాగం ప్రత్యేక అధికారి
పులుల గణనకు సమాయత్తం అవుతున్నాం. గతంలో ప్రధానంగా పాద ముద్రలపై ఆధార పడేవాళ్లం. ఇప్పుడు ఫేజ్–4 మానిటరింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఛాయా చిత్రాలు, పెంటికలు, పాదముద్రలు, భౌతికంగా చూడటం ద్వారా పులుల సంఖ్యను నిర్ధారిస్తాం. ఇలా గుర్తించిన పులికి ఒక నంబర్ ఇచ్చి, కేంద్ర వన్యప్రాణి విభాగానికి పంపిస్తాం. వాళ్లు దేశ వ్యాప్తంగా ఉన్న పులల గణాంకాలతో పుస్తకం ప్రచురిస్తారు.