కల్వకుర్తి టౌన్ : రానున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థులు పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుంచి పొందాల్సినవి..
1) చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రసీదు
2) స్క్రూటినీకి హాజరయ్యే నోటీసు
3) ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టర్
4) కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ముద్రించేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127–ఏ కింద సూచనలు
5) ప్రతిజ్ఞ లేదా శపథం చేసినట్లు ధృవీకరణ పత్రం
6) నామినేషన్ పత్రాల్లోని లోపాలతో పాటు ఇంకా జతపరచాల్సిన పత్రాల చెక్ మెమో
శాసనసభకు పోటీచేసే అభ్యర్థులు ఫారం–2బీ ని సంబంధిత రిటర్నింగ్ కార్యాలయంలో ఉచితంగా ఇస్తారు.
ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్ల వరకు దాఖలు చేయొచ్చు.
రెండు ఫొటోలు దగ్గర ఉంచుకోవాలి. ఇందులో ఒకటి స్టాంపు సైజు ఫొటోను నామినేషన్ పేపర్‌పై అంటించాలి. మరో పాస్‌సోర్టు సైజు ఫొటోను ఫారం–26(అఫిడవిట్)పై అతికించాలి.
జనరల్ అభ్యర్థులైతే రూ.10వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ కులాలు/షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారు రూ.5వేలు చెల్లించాలి. అయితే, షెడ్యూల్ కులాలు/షెడ్యూల్ తెగల వారు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి.
గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ను అదే నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన ఒక్కరే ప్రతిపాదించవచ్చు. (2బీలోని పార్ట్–1) నామినేషన్ వేసే ఇతరులు అనగా రిజిస్టర్ రాజకీయ పార్టీ వారు, స్వతంత్ర అభ్యర్థులైతే వారి నామినేషన్లు అదే నియోజకవర్గంలోని (10) మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. (2బీలోని పార్ట్–2) ఇతరులు అనగా రిజిస్టర్, గుర్తింపు పొందని, స్వతంత్ర అభ్యర్థులైతే నామినేషన్ పత్రంలోని ఫారం–2బీ, పార్ట్–3లోని (సీ) కాలం ఎదురుగా సూచించిన గుర్తుల్లో మూడింటిని ప్రాధాన్యత క్రమంలో రాయాల్సి ఉంటుంది.
పోటీ చేసే అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గం ఓటరు కానట్లయితే.. ఓటరుగా నమోదైన నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అ«ధికారి నుండి ఓటరు జాబితా సర్టిఫైడ్ కాపీని నామినేషన్ పత్రానికి జత చేయాలి.
ప్రతిపాదించే వారు నిరక్షరాస్యులైతే నామినేషన్ పేపర్‌లో వేలిముద్ర వేశాక తిరిగి రిటర్నింగ్ అధికారి ముందు కూడా వేయాల్సి ఉంటుంది.
ఎన్నికల ఖర్చులకు సంబంధించి నామినేషన్ వేసిన అభ్యర్థి 48 గంటల ముందు తన పేర కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలి. అంతకు ముందు తెరచిన అకౌంట్లను అనుమతించరు.
నామినేషన్ పత్రంలోని ప్రతీ కాలం తప్పనిసరిగా నింపాలి. ఆ కాలంలో నింపాల్సింది లేనట్లయితే లేదు / వర్తించదు అనేది రాయాలి. అంతే తప్ప డ్యాష్(–) వంటివి రాయకూడదు... ఏ కాలం కూడా ఖాళీగా వదలకూడదు.
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం–26 నోటరైజ్డ్ అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ నింపాలి. ఏదైనా నింపాల్సినది లేనట్లయితే లేదు / వర్తించదు అనేది రాయాలి. అంతే కానీ డ్యాష్(–)వంటివి రాయకూడదు.. ఏ కాలం కూడా ఖాళీగా వదలొద్దు. నామినేషన్ పత్రంలో అభ్యర్థి తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పార్ట్–3ఏ లో తప్పనిసరిగా పేర్కొనాలి.
డీసీఎల్ నుంచి విద్యుత్‌కు సంబంధించి, మున్సిపాలిటీ లేదా గ్రామపంచాయతీ నుంచి వీటికి సంబంధించిన, ప్రభుత్వం కేటాయించిన వసతిగృహం(క్వార్టర్)లో ఉన్నట్లయితే పదేళ్ల నుండి ఎలాంటి బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి
నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ముందు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ లేదా శపథం(తెలుగు మరియు ఆంగ్లం) చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞను తమకు నచ్చిన దేవుడు లేదా మనస్సాక్షిపై కానీ చేయొచ్చు.
రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి నమూనా సంతకాన్ని ఇవ్వాలి. ఇది అభ్యర్థుల తరపున ఎవరినైనా అనుమతించేందుకు ఉపకరిస్తుంది.అదే విధంగా అభ్యర్థి పేరు బ్యాలెట్ పేపర్‌లో ఎలా ముద్రించాలో తెలుగులో పేపర్ మీద రాసి ఇవ్వాలి.
ఈ ఏడాది నుండి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిర్ధిష్టంగా ఒక రాజకీయ పార్టీ టికెట్‌పై పోటీ చేసే పక్షంలో, తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను సదరు పార్టీకి తెలియజేయాలి.
సదరు రాజకీయ పార్టీ అభ్యర్థు నేర చరిత్ర సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది.
అభ్యర్ధి పూర్వాపరాలను సదరు ప్రాంతంలో విస్తృత ప్రజాదరణ కలిగిన వార్తా పత్రికల్లో డిక్లరేషన్ రూపంలో అభ్యర్థితో పాటుగా సంబంధిత రాజకీయ పార్టీ ప్రకటించాలి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం కల్పించాలి. నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత కనీసం మూడుసార్లు అలా ప్రకటించాలి.
క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు వారి నేర సమాచారాన్ని తెలుపుతూ ఫార్మాట్–సీ–1 లో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అలాంటి అభ్యర్థులను పోటీకి నిలిపే రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని ఫార్మాట్–సీ–2లో ఇస్తూ డిక్లరేషన్ ప్రచురించాలి
అభ్యర్థిత్వ ఉపసంహారణకు తుదిగడువు తేదీ నుండి ఎన్నికల తేదీకి రెండు రోజుల ముందు వరకు కనీసం వేర్వేరు తేదీల్లో వార్తాపత్రికలు,ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ డిక్లరేషన్ ప్రచురించాల్సి ఉంటుంది.
అభ్యర్థులూ.. ఇవి పాటించండి!
Published Sun, Nov 11 2018 10:35 AM | Last Updated on Sun, Nov 11 2018 10:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment