సెల్‌ఫోన్ అడిగినందుకు హత్య
- వెదిరలో బాలుడి కిరాతకం
- హతుడు బీహార్‌కు చెందిన కూలీ
వెదిర(రామడుగు) : తీసుకున్న సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఓ యువకుడిని దారుణంగా చంపాడో బాలుడు. స్థానికుడిననే గర్వంతో బీహార్‌కు చెందిన వలస కూలీని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. గురువారం మండలంలోని వెదిరకు చెందిన బాలుడు(17) బీహార్‌కు చెందిన అమర్‌నాథ్(23)ను మారుకత్తితో నరికి చంపాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్ర కారం.. బీహార్‌కు చెందిన అమర్‌నాథ్ కొద్దిరోజులుగా వె దిరలో రాళ్లబండి నాగరాజురెడ్డికి చెందిన డెయిరీలో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ క్రమంలో డెయిరీ సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న బాలుడితో ఆయనకు స్నేహం కుదిరింది. పనుల్లో ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు.
నాలుగు రోజుల క్రితం ఆ బాలుడు అమర్‌నాథ్‌కు చెందిన సెల్‌ఫోన్ తీసుకున్నాడు. వెంటనే ఇస్తానని తన వద్దే ఉంచుకుంటున్నాడు. గురువారం వ్యవసాయ బావి వద్దకు వచ్చిన బాలుడిని అమర్‌నాథ్ తన బంధువులతో మాట్లాడాలని, తన సెల్‌ఫోన్ ఇవ్వాలని అడిగాడు. ఇందుకు ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఒకరినొకరు తోసేసుకున్నారు. తన సెల్‌ఫోన్ లాక్కున్న అమర్‌నాథ్ గొడవ విషయాన్ని తన యజమాని నాగరాజురెడ్డికి ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో ఆగ్రహం చెందిన బాలుడు అక్కడున్న మారుకత్తి తీసుకుని అమర్‌నాథ్‌పై దాడి చేశాడు. దీంతో అతడు భయంతో పారిపోతుండగా వెంటాడి కింద పడేసి గొంతు కోసి చంపాడు.
సమీప పంట పొలాల్లో పనిచేసుకుంటున్న కొందరు రైతులకు కేకలు వినిపించడంతో అటువైపు వచ్చారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న అమర్‌నాథ్‌ను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కత్తితో పారిపోతున్న బాలుడిని వెంబడించి పట్టుకున్నారు. అంతలోనే అమర్‌నాథ్ మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో చొప్పదండి సీఐ సత్యనారాయణ, రామడుగు ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.