సాక్షి, పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ 2023 నాటికి ఐదు లక్షల బడ్జెట్ ప్రవేశపెడ్తాడో లేదో తెలియదు కానీ ఆరోజుకు అప్పులు మాత్రం అంతవరకు చేరుస్తాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం పెద్దపల్లిలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అప్పుల భారం అంతా సామాన్య ప్రజానీకంపైనే పడుతుందన్నారు. ఆఖరుకు తాగే నీళ్లు, పీల్చే గాలిపైనా పన్నులు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం మనదేనని, అప్పులు పెరుగుతూ పోతే వడ్డీలు కట్టేందుకు ప్రభుత్వం అన్నింటిమీదా పన్నుల రేట్లు పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇసుకను ఆదాయ వనరుగా కాకుండా సహజ వనరుగా, రాష్ట్ర సంపదగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment