
ఊరికి బస్సొస్తుందా..?
పాములపర్తి వద్ద ఆగి, వాకబు చేసిన సీఎం కేసీఆర్
వర్గల్: హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం తన ఫాంహౌస్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా వర్గల్ మండలం పాములపర్తి రోడ్డు వద్ద ఆగారు. చేతితో సైగ చేసి రోడ్డు పక్కన ఉన్న బోయిని రాజు, పంచాయతీ కార్యదర్శి వికాస్ తదితరులను కారు దగ్గరకు పిలిపించుకున్నారు. ‘ఊళ్లోకి బస్సొస్తుందా..ఎన్ని ట్రిప్పులు వస్తుంది..ఊళ్లకు బస్సు తోవ బాగనే ఉన్నదా?’ అని వాకబు చేశారు. బస్సు వస్తున్నదని, అక్కడక్కడ రోడ్డు ఇరుకుగా ఉందని వారు బదులిచ్చారు. దీంతో.. బస్సు తోవ క్లియర్ చేసుకోండ్రి అని చెప్పి సీఎం ముందుకు సాగారు.
సాయంత్రం 5 గంటలకు పాములపర్తి చేరుకున్న సీఎం కారులో నుంచే 3 నిమిషాల పాటు మాట్లాడి వెళ్లిపోయారు. సీఎం కాన్వాయ్ ఆగడంతో గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సీఎం ఆగుతారని ఎవరూ ఊహించలేదు. ఊళ్లోనే ఉన్న పీఆర్ డిప్యూటీ ఈఈ ప్రభాకర్, ఎంపీడీఓ కృష్ణన్, ఏఈలు వివేక్‌రెడ్డి, రమేష్, అధికారులు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అధికారులతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు ఈ సమాచారం తెలిసి పరుగెత్తుకుని వచ్చేలోపే సీఎం కేసీఆర్ స్థానికులతో మాట్లాడి వెళ్లిపోయారు.
ఫాంహౌస్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
జగదేవ్‌పూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం సాయంత్రం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయక్షేత్రానికి వచ్చారు. సాయంత్రం 5:15 గంటలకు ఫాంహౌస్‌కు చేరుకున్న ఆయన కాన్వాయ్‌లోని తన వాహనం దిగి, గంటపాటు వ్యవసాయక్షేత్రంలో తిరుగుతూ పరిశీలించారు. కొత్త బావి నిర్మాణాన్ని పర్యవేక్షించారు. పనులెలా జరుగుతున్నయ్? అంటూ ఫాంహౌస్ సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఖరీఫ్ సమీపిస్తోందని, వెంటనే పొలాల్లో ఎరువులను చల్లాలని సూచించినట్లు తెలిసింది. సీఎం శనివారం సాయంత్రం ఫాంహౌస్‌కు వస్తున్నారని సమాచారం ఉండడంతో ముందుగానే జిల్లా ఎస్పీ సుమతి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఫాంహౌస్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం శనివారం రాత్రి ఇక్కడే బస చేసి ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తారని తెలుస్తోంది.