
తీవ్ర విషాదంలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్రావు మరణం పట్ల కలత చెందిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యాసాగర్‌రావు ఆరోగ్యం బాగా క్షీణించి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకుంటూనే ఉన్నారు. కేసీఆర్ తన సతీమణితో సహా హాస్పిటల్ కూడా ఆయన్ని పరామర్శించారు కూడా. అప్పటి నుంచి సిఎం తనకు కలిసిన ప్రతీ ఒక్కరితో విద్యాసాగర్ రావు గురించే మాట్లాడారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు నీటి పారుదలరంగంలో జరిగిన అన్యాయంపై గణాంకాలతో సహా వివరాలు సేకరించి ప్రజలకు అవగాహన కల్పించారన్నారు.
తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం ,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యమైనదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ, సలహాలు ఇస్తూ ముందుకు నడిపారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ సహా నీటి పారుదల రంగంలో చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనలో విద్యాసాగర్ రావు విశేష అనుభవం ఉపయోగపడిందన్నారు.
జయశంకర్ తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్ రావు అని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ జాతి విద్యాసాగర్ రావును ఎన్నటికీ మరిచిపోదని ఆయన అన్నారు. విద్యాసాగర్రావు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ప్రాణాలు దక్కించడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు చేసిన కృషి, తెలంగాణ జాతి చేసిన ప్రార్థనలు ఫలించి ఆయన ఆరోగ్యం మళ్లీ మెరుగుపడుతుందని భావించానని అన్నారు.
ఆయన మరణం తెలంగాణ జాతికి తీరని లోటని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించాలనే స్వప్న సాకారంలో భాగస్వామిగా ఉండాల్సిన విద్యాసాగర్ రావు అర్థాంతరంగా మనల్ని వదిలివెళ్లారన్నారు. తనకు విద్యాసాగర్ రావు మంచి మిత్రుడని,మొదటి నుంచి కుటుంబ సభ్యుడిగా,తనకు పెద్దన్నలాగా వ్యవహరించేవారని సిఎం అన్నారు. విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.