అసెంబ్లీ సీట్లను వెంటనే పెంచండి
కేంద్ర హోంమంత్రికి సీఎం కేసీఆర్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్ఫూర్తిని తూ.చ. తప్పకుండా పాటిస్తూ శాసనసభ నియోజకవర్గాల పెంపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. పార్టీ ఎంపీలు, ఉన్నతాధికారులతో కలసి గురువారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో రాజ్‌నాథ్‌తో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపును ఉద్దేశించే చట్టంలో తగిన నిబంధనలు పొందుపరిచారని, కానీ ఈ అంశంపై అటార్నీ జనరల్ ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయం (రాజ్యాం గంలోని ఆర్టికల్ 170 ప్రకారం సీట్ల పెంపు సాధ్యం కాదంటూ) అందుకు విరుద్ధంగా ఉందన్నారు. అందువల్ల ఈ న్యాయ సంఘర్షణకు తెరదించాలని కోరారు.
సీట్ల పెంపు ఉద్దేశం లేకుంటే విభజన చట్టంలో ఆ నిబంధన ఉండేదే కాదని కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ద్వారా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇతర ఏ ఆర్టికల్ కూడా వాటిపై పైచేయి సాధించజాలదని, ఆర్టికల్ 170 అందుకు మినహాయింపు కాదని కేసీఆర్ వివరించారు. అందువల్ల రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు అడ్డంకిగా ఉన్న సాంకేతికపరమైన అంశాలను పరిష్కరిస్తూ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇందుకు హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్టు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలిసింది.
తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేసీఆర్ ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేటాయించిన ఉన్నతాధికారులతో ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మరింత మందిని కేటాయించాలని కోరారు.
ఆ తీర్పు అన్నింటికీ వర్తించదు
పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై తలెత్తిన గందరగోళంపై కేసీఆర్ హోంమంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పదో షెడ్యూల్‌లోని అన్ని సంస్థలకూ వర్తింపచేయాలనడం అర్థరహితమని ఆయన వివరించినట్టు తెలిసింది. జనాభా ప్రాతిపదిక అనేది విభజన చట్టం స్ఫూర్తి కాదని, ఈ ప్రాతిపదికన పదో షెడ్యూలులోని సంస్థలన్నింటినీ విడదీయాలనడం తెలంగాణకు అన్యాయం చేయడమే అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్లకు రూ. 300 కోట్లివ్వండి
ఖమ్మం, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో గోదావరి, ప్రాణహిత నదుల వెంట జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 1,290 కోట్లు కేటాయించినందుకు కేంద్రానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని అనుమతులు పొందిన ఈ రహదారుల నిర్మాణ పనుల ప్రారంభానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసేందుకు చొరవ చూపాలని రాజ్‌నాథ్‌ను కోరారు. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యంగల ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి మరో రూ. 300 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు రాజ్‌నాథ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కాళేశ్వరం నుంచి అర్జున్‌గుట్ట వరకు రహదారి, కాళేశ్వరం వద్ద కిలోమీటరు పొడవైన వంతెన (గోదావరి పై), రాచర్ల-వేమనపల్లి రహదారి, సోమనిగూడెం రహదారి, గూడెం-బాబా సాహెబ్ రహదారుల నిర్మాణానికి మరో రూ. 300 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాజ్‌నాథ్‌ను కలసిన వారిలో పార్టీ పార్లమెంటరీ విభాగం చైర్మన్ కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి, పార్టీ విప్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు.