సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు లాక్‌డౌన్‌కు ప్రజలు ఎంతో సహకరించారు. వారందరికి తాను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాని పేర్కొన్నారు. ఏప్రిల్ 30వరకు ప్రజలు అదే స్పూర్తిని కొనసాగించాలన్నారు. ఒకవేళ పరిస్థితులు చక్కబడితే ఏప్రిల్ 30 తర్వాత దశల వారిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో శనివారం సాయంత్రానికి 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 14మంది మృతి చెందగా, 96 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 393 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వారంతా చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు క్వారంటైన్‌లో దాదాపు 1654 మంది ఉన్నారు. కాగా వీరంతా ఈ నెల 24లోపు డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు. తొలిదశలో విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న 26వేల మంది ఇప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారన్నారు. శనివారం ఉదయం దాదపు మూడు గంటలకు పైగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కొన్ని కీలక నిర్ణయాలు తెలిపామన్నారు. ఏప్రిల్ 30వరకు లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని తాము ప్రధానికి తెలిపామని,దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని ఖరాఖండిగా తేల్చిచెప్పాయన్నారు.
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మొత్తం 243 కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయని, దీనిలో జీహెచ్‌ఎంసీలో 123, ఇతర ప్రాంతాల్లో 103 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కంటైన్మెంట్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా అమలవుతుందని,ప్రజలంతా సహకరించాలని కోరారు. మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని , తెలంగాణకు మహారాష్ట్ర బోర్డర్‌గా ఉండడంతో కరోనా కేసులు సంఖ్య పెరగకుండా జాగ్రత్తపడుతున్నామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి వర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున కీలక సూచనలు చేశామని తెలిపారు. నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రధానిని కోరామన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కూడా 6శాతం పెంచాలని, ప్రస్తుత పరిస్థితుల్లో క్యూఈ విధానం అమలు చేస్తే బాగుంటుందని తెలిపామన్నారు. రాష్ట్రాలకు హెలికాప్టర్ మనీ ద్వారా నిధులు సమకూర్చాలని, రాష్ట్రాలకు ఉన్న అప్పులను 6నెలలపాటు వాయిదా వేయాలని కూడా కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఏప్రిల్ 15 వరకు వ్యవసాయానికి నీటి కేటాయింపులు చేస్తామన్నారు. రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. పప్పు, శనగలను కూడా రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ యధావిధిగా పనిచేస్తాయని తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్ డెలివరీ చేస్తామని, నిత్యావసర సరుకులను కల్తీ చేస్తే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని కేసీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment