
మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జిల్లాలోని 499 గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికను సమగ్రంగా అమలుచేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. బుధవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో 30 రోజుల ప్రణాళికపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు 30 రోజుల ప్రణాళిక అమలవుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ ప్రణాళికను ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులతో కూడిన 121 బృందాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక శాఖలు గ్రామాల అభివృద్ధికి ప్రతీ నెల రూ.339 కోట్లు అందిస్తుందన్నారు. ఈజీఎస్‌లో భాగంగా జిల్లాలో 27 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీకో ట్రాక్టర్
సర్పంచ్ పాలకవర్గం సమన్వయంతో మరిన్ని రోజుల్లో ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో చెట్లకు నీళ్లు పోయడం వల్ల ట్యాంకర్ యజమాని అకౌంటులో డబ్బులు జమ అయ్యేవని, ఇక నుంచి గ్రామ పంచాయతీ అకౌంటులో జమ అవుతాయన్నారు. గ్రామంలో çప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలన్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగా ఉండేలా చూడాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో ప్రతీ అధికారి ఉదయం 6 గంటలకు గ్రామాలకు చేరకొని పనులు చేపట్టాలన్నారు.
పనులకు గ్రేడింగ్
అన్ని జిల్లాలకు గ్రేడింగ్ ఇస్తారని, జిల్లా స్థాయిలో మండలాలకు, మండల స్థాయిలో గ్రామాలకు గ్రేడింగ్ ఇస్తారని తెలిపారు. కలెక్టర్ అనుమతి లేకుండా ఎలాంటి సెలవులు మంజూరు చేయడం ఉండదని స్పష్టం చేశారు. గ్రామాలో పనిచేసే పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం పెంచినట్లు పేర్కొన్నారు. పంచాయతిలో ఒక్కొక్కరికి రూ.1,600 చొప్పున సుమారు రెండు వేల మంది ఉంటే రూ.32 లక్షలను గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తలపెట్టిన 30 రోజుల ప్రణాళికలో తను పాల్గొంటానని తెలిపారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా అధికారులు, ప్రజాప్రతినిదులు చొరవ చూపాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో 30 రోజుల ప్రణాళికలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అధికారులు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment