పథకాల కుదింపే ఎజెండా!
నేటి నుంచి సీఎస్ ఆధ్వర్యంలో సమీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీ కసరత్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా పెద్దగా అవస రం లేని పథకాలను కుదించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. శని, సోమవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి, పురపాలక, విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం-అనుబంధ శాఖలు, పౌర సరఫరాలు, అటవీ-పర్యావరణం, ఇంధ నం, న్యాయ, ప్రణాళికా శాఖల అధికారులతో శనివారం.. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజ న, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, ఆర్ అండ్ బీ, రవాణా, రెవెన్యూ, పరిశ్రమలు, పెట్టుబడులు, గృహ నిర్మాణం, కార్మిక శాఖ, పర్యాటక, సాంస్కృతిక, ఐటీ, జీఏడీ, హోం శాఖల ఉన్నతాధికారులతో సోమవారం భేటీకానున్నారు.
అయితే ప్రధానంగా పథకాలను కుదించే అంశంపైనే ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్‌లో వందలాది పథకాలకు నిధులు కేటాయించే ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రస్తుతం వాటిలో అవసరం లేనివి, కాలం చెల్లిన వాటిని తొలగించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. పలు చిన్న చిన్న పథకాలను ఇతర పథకాల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పద్దుల సంఖ్య తగ్గి బడ్జెట్ కేటాయింపులు మరింత స్పష్టంగా ఉంటాయని భావిస్తోంది.
ప్రాధాన్యతాక్రమంలో ఏయే పథకాలను కొనసాగించాలి, వేటిని రద్దు చేయాలి, వేటిని విలీనం చేసే అవకాశముందనే దానిపై పూర్తి సమాచారంతో ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచిం చింది. వాటన్నింటినీ పరిశీలించి చివరకు మిగిలే పథకాల తుది జాబితాను సిద్ధం చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎస్ సారథ్యంలో అధికారుల భేటీలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ముఖ్య కార్యదర్శులతో రెండు, మూడు దఫాలు బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన కేబినెట్ భేటీలోనూ బడ్జెట్‌పైనే సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేయాలని మంత్రులు, కలెక్టర్లను ఆదేశించారు. దీంతో పథకాల కుదింపు ఒకవైపు.. ప్రణాళికల తయారీ మరోవైపు వేగం పుంజుకున్నాయి.