బరిలో ఎవరు? | Congress Party Leaders Struggling For Sircilla MP Seat | Sakshi
Sakshi News home page

బరిలో ఎవరు?

Published Sun, Jun 24 2018 2:47 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Party Leaders Struggling For Sircilla MP Seat - Sakshi

బరిలో ఎవరు?

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : తమ నేతలపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం జిల్లాలో చర్చకు దారి తీసింది. రానున్న సార్వత్రిక ఎన్ని కల్లో వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో ఆ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సస్పెన్షన్‌ అమలులో ఉన్న ఆరుగురు నేతలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) ఇటీవల ప్రకటించింది. ఇందులో జిల్లా నుంచి కాంగ్రెస్‌ నేత, మాజీ వరంగల్‌ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. రెండున్నరేళ్లుగా సస్పెన్షన్‌ అమలులో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తాజా నిర్ణయంతో రాజకీయాల్లో తిరిగి యాక్టివ్‌ అయ్యేందుకు రాజయ్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం జనరల్‌ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్‌ అయ్యింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అనంతరం 2015లో వచ్చిన ఉప ఎన్నికల్లో మూడోసారి రాజయ్యకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. నామినేషన్‌ వేసే రోజు న ఆయన ఇంట్లో చోటుచేసుకున్న దుర్ఘటనతో కోడలు సారిక, ముగ్గురు మనుమళ్లు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజయ్య కు టుంబంపై ఆయన కోడలు తీవ్ర ఆరో పణలు చేసింది. దీంతో కాంగ్రెస్‌ అధి ష్టానం ఆయన టికెట్‌ను రద్దు చేయడంతోపాటు  సస్పెండ్‌ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సర్వే సత్యనారాయణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అప్పటినుంచి వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే అంశంపై అనేక పేర్లు వినిపించాయి. అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాజీ మంత్రి గుండెబోయిన విజయరామారావుతో పాటు బక్క జడ్సన్, నమిండ్ల శ్రీనివాస్, దొమ్మాటి సాంబయ్య తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో రాజయ్యపై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో మరోసారి చర్చ మొదలైంది. మరోవైపు ఆనవాయితీ ప్రకారం తటస్తుల వైపు కాంగ్రెస్‌ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ నేపథ్యం లేని తటస్థులు కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉండేందుకు ఆసక్తిగా ఉన్నారు.

తటస్థులు..


  • కాకతీయ యూనివర్సిటీలో పని చేస్తు న్న ఓ అధ్యాపకుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సిట్టిం గ్‌ ఎంపీగా పసునూరి దయాకర్‌ ఉన్నారు. అంతేకాకుండా ఈ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • ఉద్యోగ సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న  మరో నేత రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ సంఘం నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి టికెట్లు సాధించుకునేందుకు పార్టీలో ఉన్న పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
  • వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల సందర్భంగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత పేరు తెరపైకి వచ్చింది. చివరి నిమిషం వరకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. అయితే.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందున్నా విద్యాసంస్థల అ«ధినేత ఆసక్తిగా ఉండడంతో కాంగ్రెస్‌ పెద్దలు ఈయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement