
జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్
పటాన్‌చెరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి రానుందని ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన అమీన్‌పూర్‌లోని బీరంగూడ మల్లికార్జున దేవస్థానం ఆవరణలో పూజలు చేసి ప్రచార రథాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు బీజేపీని దూరం పెడుతున్నారని, కాంగ్రెస్‌తోనే దేశం అభివృద్ధి చెందిందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. మోడీ పాలనకు చెరమగీతం పాడేందుకు ప్రజలంతా కాంగ్రెస్‌నే బలపరుస్తున్నారని చెప్పారు. మెదక్ అభ్యర్థిగా తనకు పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తెలంగాణాకు ఎలాంటి లాభం ఉండబోదని, మెదక్ ప్రజల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. నరేంద్రమోదీ పాలనలో దేశానికి తీవ్ర నష్టం జరిగిందని, అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక ప్రగతి దెబ్బతిందన్నారు. నల్లధనం, నకిలీ నోట్ల పేరుతో పెద్ద నోట్ల రద్దు చేశారని కానీ ఎక్కడ నల్లధనాన్ని కనిపెట్టలేకపోయారన్నారు. కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే తనకు అవకాశం ఇచ్చినందుకు ఆ పార్టీ అధిష్టానానికి, నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేయాలని కార్యకర్తలకు విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌యాదవ్, సపాన్‌దేవ్‌లు పాల్గొన్నారు.