చెరువులను పరిరక్షిస్తాం | control acts to the ponds | Sakshi
Sakshi News home page

చెరువులను పరిరక్షిస్తాం

Published Tue, Dec 23 2014 11:32 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

control acts to the ponds

శంషాబాద్ రూరల్ : రా్రష్టంలో కబ్జాకు గురైన చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. చెరువుల పునరుద్దరణతో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని చిన్నగోల్కొండలో మంగళవారం రూ.1.20  కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11 కేవీఏ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు రూ.42.35 లక్షలతో నిర్మించ తలపెట్టిన పాఠశాల అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపనను  స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌తో కలిసి చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 3,718 చెరువులను పునరుద్ధరించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల కబ్జాలను తొలగించి, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శంషాబాద్‌కు కృష్ణా జలాల సరఫరాకు రూ.13 కోట్లు చెల్లించినట్లు  పేర్కొన్నారు. జంట నగరాలతో పాటు నగరం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణా జలాలను తీసుకొస్తామన్నారు. స్థానికంగా సబ్‌స్టేషన్ నుంచి 24 గంటల కరెంటు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జీఓ 111ను సడలించాలి:  ఎమ్మెల్యే..
శంషాబాద్ ప్రాంతం అభివృద్ధికి ఆటంకంగా మారిన జీఓ 111 సడలింపు కోసం మంత్రి చొరవ తీసుకోవాలని  ఎమ్మెల్యే  ప్రకాష్‌గౌడ్ కోరారు.  శంషాబాద్ మండలంలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు మంత్రి కృషి చేయాలని ఎంపీపీ చెక్కల ఎల్లయ్య కోరారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్ కోరారు. కార్యక్రమంలో చివరగా లబ్ధిదారులకు మంత్రి ఆసరా పింఛన్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సారా సువర్ణ కృష్ణగౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ కె.శ్రావణ్‌కుమార్‌గౌడ్, శంషాబాద్ సొసైటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సర్పంచులు దౌనాకర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, సిద్దేశ్వర్, సత్యనారాయణ, ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంఈఓ ఎస్.నర్సిం హారావు, ప్రధానోపాధ్యాయుడు పాపిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement