జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్‌లో మూడు రోజుల క్రితం బారికేడ్ల తొలగింపును పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ
నిర్మల్: కరోనా మహమ్మారి నుంచి జిల్లా బయటపడినట్లేనా..! ఇక పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు లేవా.. అంటే ప్రస్తుత పరిస్థితులు ఒకింత అవుననే సంకేతాలే ఇస్తున్నాయి. జిల్లా నుంచి ఇప్పటివరకు మొత్తం 529 శాంపిళ్లను పంపించగా.. కేవలం 20 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే ముగ్గురు కరోనా బారిన పడి చనిపోవడం ఆందోళన కలిగించింది. సంపూర్ణ లాక్‌డౌన్ అమలుతో పరిస్థితులలో కొంత మార్పు వచ్చింది. పక్షం రోజులుగా జిల్లా కేంద్రంలో కేవలం ఒకే కేసు మాత్రమే నమోదైంది. క్వారంటైన్ పీరియడ్ పూర్తి కావడంతో కంటైన్మెంట్ జోన్లను కూడా ఎత్తి వేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సడలింపులు కూడా ఇచ్చా రు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సడలింపులు ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది ఇక కరోనా పోయిందన్నట్లుగానే వ్యవహరించడం మిగతా వారిని ఆందోళనకు గురి చేస్తోంది. విచ్చలవిడిగా రోడ్లపైకి రావడం, కనీస భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించడం కలవరపరుస్తోంది.
తగ్గినట్లేనా..
జిల్లాలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు, ప్రస్తుత పరిస్థితులను బట్టి కరోనా ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు 20 పాజిటివ్ కేసులతో దేశంలోని రెడ్‌జోన్లలో ఒకటిగా జిల్లా కొనసాగింది. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వారిలో ఎనిమిది మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం తెలిసిందే. మరోవైపు జిల్లాలోనూ పదిహేను రోజులలో జిల్లా కేంద్రానికి చెందిన ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఆయనతో ప్రాథమిక సంబంధాలు కలిగిన వారి శాంపిళ్లను పరీక్షించగా నెగిటివ్ రావడం గమనార్హం. తానూరు మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తి కూడా ఈ పదిహేను రోజుల్లోనే కరోనా బారినపడి చనిపోయారు. వైద్యం కోసం నిజామాబాద్ వెళ్లడంతో అక్కడే ఆయనకు వైరస్ సోకినట్లు తెలిసింది. తానూరుతో పాటు ఆయనకు సంబంధించిన ప్రాథమిక వ్యక్తులు అందరినీ పరీక్షించగా వారికి నెగిటివ్ తేలింది. ఈ రెండు కేసులతో ప్రాథమిక, సెకండరీ సంబంధాలు కలిగిన వ్యక్తులకు కరోనా సోకక పోవడం ఊరటనిచ్చింది. ఈ వారంలోనూ వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.
కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత..
జిల్లాలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితోనే కరోనా కేసులు మొదలయ్యాయి. మొదటి వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. సంబంధిత వ్యక్తికి చెందిన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అలా మొదలై జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని రెడ్ జోన్‌లలో ఒకటిగా జిల్లా నమోదైంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలన్నింటినీ కంటైన్మెంట్ జోన్లుగా జిల్లా అధికారులు ప్రకటించారు. మొత్తం 14 ప్రాంతాలతో పాటు ప్రభావిత గ్రామాలను సైతం కంటైన్మెంట్ గానే పరిగణించారు. వీటిని ప్రకటించి కూడా 14 రోజుల పీరియడ్ పూర్తయింది. ఆయా ప్రాంతాలలో మళ్లీ పాజిటివ్ కేసులు సైతం నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు శుక్రవారం నుంచి కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు తొమ్మిది జోన్లను ఎత్తివేశారు.
సడలింపులతో..
జిల్లాలో మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వాలని సూచించడంతో జిల్లా అధికారులు ఆ దిశగా పలు సడలింపులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర సేవలతో పాటు నిత్యఅవసరాల కొనుగోలు కోసం కిరాణా దుకాణాలు తెరిచి ఉంచే అవకాశం కల్పించారు. అవసరం ఉన్నవారికి ఈ సడలింపులు ఊరటనిచ్చే విషయమే. కానీ.. ఇదే అదనుగా చాలా మంది అవసరం లేకున్నా.. అత్యవసరం కాకున్నా.. రోడ్లపైకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కనీస నిబంధనలు పాటించక పోవడం భయానికి గురి చేస్తోంది. విచ్చలవిడిగా రోడ్లపై దుకాణాల వద్ద తిరుగుతూ కనిపిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం అనే ఈ విషయాన్ని మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. కనీసం మాస్క్‌లను సైతం ధరించకుండా మిగతా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అత్యవసర, నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలను మాత్రమే తెరిచి ఉంచాలని స్పష్టంగా చెప్పినా... ఇతర దుకాణాలను సైతం తెరుస్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు మూసివేయడం వారు వెళ్లగానే మళ్లీ తెరవడం కొనసాగిస్తున్నారు. ఓ వైపు అధికారులు లాక్ డౌన్ కొనసాగుతోందని, నిబంధనలతో కూడిన సడలింపులు ఇచ్చామని స్పష్టంగా చెబుతున్నా.. పెడచెవిన పెడుతున్నారు. కొంతమంది అనుసరిస్తున్న ఇలాంటి తీరుతో మిగతా సమాజమంతా భయాందోళనకు గురి అవుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జిల్లాను మళ్లీ కరోనా మహమ్మారి బారిన పడనివ్వద్దని, నిబంధనలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను విన్నవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment