వానాకాలం వచ్చినా కోతలే..
- అధికారికంగా గ్రామాల్లో 6 గంటలు
- మండల కేంద్రాల్లో 2 గంటలు
- సబ్‌స్టేషన్ పరిధిలోనూ 2 గంటలు
- అనధికారిక కోతలూ అమలు
హన్మకొండ : వానా కాలం మొదట్లోనే కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యూయి. విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గిందంటూ ప్రభుత్వం కోతలు విధించేందుకు అనుమతి ఇచ్చింది. వరంగల్ సర్కిల్‌లో శుక్రవారం నుంచి కోతలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత్ అవసరం కొంత మేరకే ఉంది. అయినప్పటికీ... విద్యుత్ కోతలు అమలు చేయూలని ట్రాన్స్‌కో నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
గ్రామాలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాల వారీగా విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. వరంగల్ నగరంలో మాత్రం విద్యుత్ కోతలు విధించలేదు. వేసవి నుంచి విద్యుత్ సరఫరా కొంత మెరుగ్గానే ఉంది. రబీ తర్వాత వ్యవసాయ మోటార్లు నడవడం లేదని, జిల్లాకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటూ నిరంతర సరఫరా చేశారు. గ్రామాల్లో మాత్రం అనధికారికంగా గంటో, రెండు గంటలో కోత పెట్టినా... కొద్ది రోజులకే పరిమితం చేశారు. తాజాగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని అధికారిక కోతలు అమలు చేస్తూనే... ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) పేరిట అనధికార కోతలూ అమలు చేస్తున్నారు.
గ్రామాల్లో అనధికార కోతలు కూడా..
ఈ సారి గ్రామాలకు విద్యుత్ సరఫరా పరిస్థితి అధ్వానంగా మారింది. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. పలు సందర్భాల్లో రాత్రి కూడా సరఫరా నిలిపివేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. పలు కారణాలు, సరఫరాలో సాంకేతిక లోపం అంటూ రోజూ రాత్రి పూట గంటపాటు కోత విధిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ఎల్‌ఆర్ తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో అధికారిక కోత 6 గంటలే అయినా... 8 గంటలపాటు కరెంట్ ఉండడం లేదు.
మండలాల్లో 2 గంటలు
జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటలపాటు కోత విధిస్తున్నారు. రెండు రోజుల నుంచే కోతలు అమలు చేస్తున్నా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. విద్యుత్ కోతలు అమలు చేయూలని అన్ని మండలాలు, డివిజన్లకు ఉన్నతాధికారులు ఫోన్‌ల ద్వారా సమాచారమిచ్చారు. మండల కేంద్రాల్లో అధికారికంగా 2 గంటలు కోత పెడుతున్నా... మరో గంటపాటు అనధికారికంగా అడపాదడపా తీసేస్తున్నారు.
సబ్‌స్టేషన్ పరిధిలో 2 గంటలు
జిల్లాలోని 226 సబ్‌స్టేషన్ కేంద్రాల్లో అధికారిక కోత 2 గంటలు కాగా... ఇక్కడ కూడా అదనంగా 30 నుంచి 50 నిమిషాల పాటు అనధికారికంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.