ఇక కష్టమే! | However, it is very difficult! | Sakshi
Sakshi News home page

ఇక కష్టమే!

Published Wed, Nov 19 2014 2:13 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

ఇక కష్టమే! - Sakshi

ఇక కష్టమే!

కడప అగ్రికల్చర్: రైతన్న వ్యవసాయమంటేనే విముఖత చూపుతున్నాడు. పంటల సాగుకు పూర్తి పదును వర్షాలు లేకపోవడం, మరో పక్క చెరువులు, కుంటలు, డ్యామ్‌లలో నీరు అడుగంటి పోవడం, దీనికి తోడు వేసవిలో వచ్చే విద్యుత్ కోతలకు జడిసి పంటల సాగుకు రైతన్నలు పూనుకోవడంలేదు. అన్ని సమస్యలూ అధిగమించి పంట పండించినా మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతన్న సాగుకు దూరమవుతున్నాడు.

రుణమాఫీతో బ్యాంకులు కనీసం పంట పెట్టుబడికి కూడా రుణం ఇచ్చే స్థితిలో లేకపోవడంతో సాగుకు వెనుకంజవేస్తున్నాడు. దీంతో ఈ రబీ సీజన్‌లో పంటలసాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. జిల్లా సాధారణసాగు విస్తీర్ణం 2 లక్షల 03 వేల 726 హెక్టార్లలో పంటల సాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రచించారు. రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 53 వేల 215 హెక్టార్లలో మాత్రమే అన్ని రకాల పంటలు సాగయ్యాయి.

ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నా రైతులు మాత్రం ఈ వర్షాలను, వాతావరణాన్ని నమ్ముకుని పంటలు సాగుకు సాహసించలేకపోతున్నారు. కారణమేమంటే ఖరీఫ్‌లో ప్రారంభంలో పంటల సాగుకు అరకొర వర్షాలు పడటంతో ఎలాగైనా రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని రైతులు నమ్మకంతో పంటలను సాగు చేశారు.

అయితే ఆ తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితిని చవి చూశారు. గత అక్టోబరు నెలలో సాధారణ వర్షపాతం 131.9 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 73.7 మిల్లీ మీటర్లు కురిసింది. అలాగే ఈనెలలో సాధారణ వర్షపాతం 93.4 మిల్లీ మీటర్లకుగాను ఇప్పటి వరకు 36.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అయితే ఆశించిన వర్షాలు కురవకపోవండతో బోరుబావుల కింద పంటల సాగుకు రైతులు మక్కువ చూపలేక పోతున్నారు.

బోరుబావుల కింద ప్రధాన పంట వేరుశనగ సాధారణ సాగు18 వేల 831 హెక్టార్లుకాగా ఇప్పటి వరకు 1654 హెక్లార్లలో మాత్రమే సాగు చేశారు. వర్షాధారం కింద ప్రధాన పంట బుడ్డశనగ సాధారణసాగు 89 వేల 292 హెక్టార్లుకాగా 36 వేల 944 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గతేడాది 60 వేల 943 హెక్టార్లలో సాగు చేశారు. రెండో ప్రధాన పంట పొద్దుతిరుగుడు సాధారణసాగు 51 వేల 774 హెక్టార్లుకాగా ఇప్పటి వరకు 3278 హెక్టార్లలో సాగుచేశారు. అన్ని పంటల సాగు ఇంకా పెద్దగా పెరిగే సూచనలు కనిపించడం లేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
 
 కరువుకు భయపడే ఈ పరిస్థితి...
 ఖరీఫ్‌లో కరువు ఛాయలు నెలకొనడంతో రబీలో కూడా దాదాపు ఇదే పరిస్థితులు ఉత్పన్నమైతే పంట కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కూడా రాదేమోననే అనుమానంతో రైతులు చాలా మటుకు పంటలసాగు చేయలేదని తెలుస్తోంది. ఈశాన్య రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. రుతుపవనాలు బలంగా ఉంటే ఆశించిన వర్షాలు ఎందుకు కురవలేదని రైతులు వాతావరణ శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తున్నారు.
 
 పంట సాగు వివరాలు
 
 పంట        సాధారణ        సాగైన
             సాగు        పంటలు
             హెక్టార్లు        హెక్టార్లు
 వరి            10819        1125
 జొన్న          7234        2931
 సజ్జ              1581            50
 మొక్కజొన్న     1881          683
 బుడ్డశనగ    89292         36944
 పెసర            456          798
 మినుము      4727           1709
 ఉలవ          1540          625
 అలసంద            693          230
 వేరుశనగ     18831        1654
 పొద్దుతిరుగుడు51774        3278
 నువ్వులు        6260           2260
 ధనియాలు        7369           3789
 పత్తి                1269            70
 మొత్తం         2,03,726         53,215

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement