
ఒకే దఫాలో రుణమాఫీ అమలు చేయాలి: ఉత్తమ్
హుజూర్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఒకే దఫాగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకాన్ని ఒకేసారి అమలు చేయకపోవడం, రాష్ట్రంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.
ఇప్పటి వరకు సుమారు 1300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ప్రభుత్వం ఆ సంఖ్యను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తూ ప్రజలకు తాగునీరు లభించక, పశువులకు పశుగ్రాసం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.