* నియామకాలన్నా ఆపండి..
* ఇరు రాష్ట్రాల సీఎంలకు ఏజేసీ ఎస్.ఎస్.రాజు లేఖ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూ పడం లేదు. వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి వెళ్లాలని యోచిస్తున్నారు. ఇందుకు నిదర్శనం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎస్.రాజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడులకు ఓ లేఖ రాయడమే. తెలంగాణలో పనిచేస్తున్న తమను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని, లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న నియామకాలనైనా ఉద్యోగుల పంపకాలు జరిగే వరకు నిలిపివేయాలని ఈ లేఖలో కోరారు.
ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో పాటు, రెవెన్యూ శాఖల మంత్రులకు కూడా ఈ లేఖలను పంపారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లాస్థాయి అధికారులు సుమారు 40 మంది వరకు ఉంటారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 50 రోజులు దాటింది. ఈ ఉద్యోగుల పంపకాల విషయం ఎటూ తేలకపోవడంతో ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ పంపకాలకు సంబంధించి సర్కారు నుంచి ఎప్పుడెప్పుడు ఉత్తర్వులు వస్తాయోనని వేచి చూస్తున్నారు. మరోవైపు సీమాంధ్ర అధికారులు వెళ్లిపోతే ఆ ఖాళీల్లో తమకు ఉన్నత ఉద్యోగావకాశాలు అందుతాయని మన రాష్ట్రానికి చెందిన అధికారులు ఆశాభావంతో ఉన్నారు.
వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులను ఆ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ఇరు ప్రాంతాల అధికారుల మనోభావాలు దెబ్బతినకముందే ప్రభుత్వాలు స్పందించాలని అంటున్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసి ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులను అక్కడికి పంపాలని కోరుతున్నాను.
అయితే.. ఉద్యోగుల పంపకాల కోసం నియమించిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఇంకా రాకపోవడంతో ఉద్యోగుల పంపిణీ విషయంలో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాప్యంతో ఏపీలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ భర్తీ అవుతున్నాయని ఆ ప్రాంతానికి చెందిన అధికారులు వాపోతున్నారు. ఈ పంపకాల విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవచూపాలని వారు పేర్కొంటున్నారు.
త్వరగా పంపండి..
Published Sun, Jul 20 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM
Advertisement
Advertisement