సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్, పక్కన పార్టీ నేతలు
సాక్షి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏఐసీసీ సభ్యులు మధుయాష్కిగౌడ్ విమర్శించారు. ఈ రెండు పార్టీల ప్రేమాయణం బయటపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం కాంగ్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో హామీలను సాధించడంలో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. చిన్నా, చితక వ్యాపారుల బతుకులను రోడ్డు పాల్జేసిన పెద్దనోట్ల రద్దు వంటి ప్రధాని మోదీ నిర్ణయాలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు పలికారని గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ వెనుక మోదీ ఉన్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న దళిత నేతకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ సర్కారు హయాంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 16 శాతానికి తగ్గాయని ఆరోపించారు. దేశంలో మైనార్టీలు, దళితులపై దాడులు జరుగుతుంటే టీఆర్‌ఎస్ కనీసం స్పందించిన దాఖలాల్లేవన్నారు.
బీజేపీ గెలిస్తే రాజ్యాంగేతర శక్తిగా మారుతుంది..
బీజేపీపైనా మధుయాష్కి నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగేతర శక్తిగా మారుతుందని ఆరోపించారు. గోమాత పేరుతో హత్యలకు పాల్పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రధాని మోదీ తన స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని మతపరంగా విభజిస్తున్నారని అన్నారు. తాను గెలిచాక పసుపుబోర్డు సాధిస్తానని, పసుపునకు రూ.పదివేలు, ఎర్రజొన్నకు రూ.మూడు వేల క్వింటాలు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస ఆదాయం కల్పించే దిశగా పథకాలను అమలు చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకుంటుందని, జ్యోతిష్యులను కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత వైఫల్యాల నుంచే తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని మధుయాష్కి ప్రకటించారు. విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, తాహెర్‌బీన్ హందాన్, ఈరవత్రి అనీల్, అర్కల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment