సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : గంగిగోవు పాలు గంటెడైనను చాలు.. కడవెడైననేమి ఖరము పాలు.. అంటూ వేమన కవి భక్తిసారాన్ని వివరించే క్రమంలో బోధిస్తారు. ఖరము (గాడిద) పాలు నిరుపయోగమనే అర్థం. కానీ..విచిత్రంగా ఇప్పుడు ఈ ఖరము పాలకే గిరాకీ వచ్చి పడింది. ఎంతగా అంటే..ఖరము పాలు గరిటెడైనా చాలు..అనేంతగా. అవును మరి చిన్న చాయ్ గ్లాస్ సైజు పాత్ర పాలు రూ.100, రూ.150 ధర పలుకుతోంది. మంచిర్యాలకు చెందిన ముగ్గురు యువకులు మూడు గాడిదలతో ఊరూరా తిరిగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. కావాలనుకున్న వారికి అక్కడికక్కడే పాలు పితికి పోస్తున్నారు. ఈ పాలు తాగితే..ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, దమ్ము, ఆస్మా, దగ్గు తగ్గుతాయని, శ్వాసకోశ వ్యాధులు నయం అవుతాయని వీరు చెబుతున్నారు. ఆవు, గేదె, మేకల పాల కన్నా శ్రేష్టమైనవని వివరిస్తున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి..
పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు వెళ్లి విక్రయిస్తున్నాం. గాడిదపై ఆధారపడి జీవనంసాగించే వారికి ప్రభుత్వం ఆర్థికంగా రుణాలు మంజూరు చేసి గాడిద పాలవిక్రయాలను ప్రోత్సహించాలి.
– ఇరగదిండ్ల వినోద్
పాల్వంచలో గాడిద పాలను
పితుకుతున్న యువకుడు
Comments
Please login to add a commentAdd a comment