అటకెక్కిన సంక్షేమ పథకాలు
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, రేషన్, 108, 104, ఇంది రమ్మ ఇళ్ల పథకాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమీషన్లు దండుకోవడానికే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయిస్తున్నారని, రాష్ర్టంలో ఈ రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేసి సాగునీటిని అందించారా? అని ప్రశ్నించారు.
మాటల గారడీ చేస్తూ.. పూటకోమాట చెబుతున్న కేసీఆర్ పాలనకు కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఇప్పటికే ప్రజల్లో దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇప్పుడు కొత్త జిల్లాలంటూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముందుగా జలయజ్ఞంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాం డ్ చేశారు. మంత్రి తుమ్మల ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తుమ్మలను పాలేరు ఎన్నికలో పోటీలోకి దించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతునిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి విజయం ఖాయమన్నారు.