మాజీమంత్రి, కాంగ్రెస్ నేత ఎండీ ఫరీదుద్దీన్ టీఆర్ఎస్లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ నేత ఎండీ ఫరీదుద్దీన్ టీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఏడాది కాలంగా ఫరీదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి గీతారెడ్డితో విభేదాలు తలెత్తాయి. దాంతో అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఫరీరుద్దీన్ పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారని గీతారెడ్డి అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దాంతో ఫరీద్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం నెల రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఫరీద్ టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులంతా టీఆర్‌ఎస్‌లో చేరారు.