బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో సోమవారం కురిసిన కుండపోత వర్షానికి తండ్రీ కొడుకులు సజీవ సమాధి అయ్యారు. పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన ఓ కుటుంబం గుడిసెల్లో నివాసం ఉంటుండగా.. అకస్మాత్తుగా గుడిసెపై మట్టి పెళ్లలు విరిగి పడటంతో ఇద్దరు తప్పించుకోగా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెం.10 లోని తెలంగాణ భవన్ వెనుకాల ఉన్న నాయుడునగర్‌లో సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భారీ వర్షానికి కృష్ణాపురం కాలనీలో ఓ ప్రహరీ కూలిపోగా రోడ్డు కోసం వేసిన మట్టి అంతా వరద నీటితో కొట్టుకొచ్చి కిందనే ఉన్న గుడిసెలను ముంచెత్తింది. బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చున్న యాదులు అలియాస్ జాన్(30) ఆయన ఆరు నెలల కుమారుడు.. ఇద్దరూ మట్టి కింద కూరుకుపోయారు. అదృష్టవశాత్తు ఆయన భార్య మీనా, కూతురు అమ్ములు తప్పించుకొని బయటపడ్డారు. కళ్లముందే భర్త, కొడుకు మట్టిలో కూరుకుపోవడంతో మీనా హాహాకారాలు చేస్తూ కుప్పకూలిపోయింది.
అప్పటికే చుట్టుపక్కల ఉన్న గుడిసెలను మట్టి ముంచెత్తుతుండటంతో వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. కుండపోత వర్షంతో ఆ ప్రాంతానికి వెళ్లడమే కష్టమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు పూనుకోగా వర్షం ఆటంకంగా మారింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా పాతిక మంది స్థానికులు గంపలు, పారలు చేతబట్టి మట్టిని తవ్వి విగత జీవులుగా మారిన యాదులు, చిన్నారిని బయటకు తీశారు. అయితే చిన్నారి కొద్దిగా ప్రాణంతో ఉన్నాడని ఆశించిన తల్లి అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లో విషాదం నింపింది. సంగారెడ్డిజిల్లా నారాయణఖేడ్‌కు చెందిన యాదులు, మీనా దంపతులు పదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. నాయుడునగర్‌లో గుడిసె వేసుకొని బతుకుతున్నారు. వికలాంగుడైన యాదులు ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. మీనా దినసరి కూలిగా పని చేస్తున్నది. వరదతో మట్టి కొట్టుకొచ్చే సమయంలో వికలాంగుడైన యాదులు నడవలేని పరిస్థితిలో ఒక్కసారిగా గుడిసె కూలడం, పైన మట్టి పేరుకుపోవడం జరిగింది.
తండ్రీ కొడుకు సజీవ సమాధి
Published Tue, Oct 3 2017 9:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement