ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
► అధికారులకు కలెక్టర్ జగన్మోహన్ ఆదేశం
► డయల్ యువర్ కలెక్టర్‌కు ఎనిమిది కాల్స్
► కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగం
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అధికారులను ఆదేశించా రు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ సుందర్ అబ్నార్ అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులకు ఎన్ని పనులు ఉన్నా సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్‌లో ఉంచకూడదని పేర్కొన్నారు. గత వారం వరకు వచ్చిన అర్జీలపై సమీక్షించారు. ఉదయం 10 గంటల నుంచి 10:30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. జిల్లా నుంచి ఎనిమిది మంది నేరుగా కలెక్టర్‌ను ఫోన్‌ద్వారా సంప్రదించి తమ సమస్యలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జేసీ సుందర్ అబ్నార్, డీఆర్వో సంజీవరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్థికంగా ఆదుకోవాలి
రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసేవాళ్లం. రూ.1.20 లక్షలు అప్పు ఉంది. నా భర్త భాస్కర్ 2013లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అపద్భాందు పథకం కింద ఆర్థికంగా ఆదుకోవాలని గత మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పథకం కింద నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలి. - కీర్తి అనూష, గుడిహత్నూర్
టవర్ నిర్మాణాన్ని ఆపాలి
మా గ్రామంలో అక్రమ లే అవుట్‌లో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా రిలయన్స్ టవర్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం. రేడియేషన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. టవర్ జనావాసాలకు, పాఠశాలకు దగ్గరగా ఉంది. దీనిని ఆపివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. - యువజన సంక్షేమ సంఘం నాయకులు, భీంసరి, ఆదిలాబాద్