హవ్వ.. దాచుకున్నారా.. | give clarify on election expenditure | Sakshi
Sakshi News home page

హవ్వ.. దాచుకున్నారా..

Published Thu, Jun 5 2014 3:38 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM

హవ్వ.. దాచుకున్నారా.. - Sakshi

హవ్వ.. దాచుకున్నారా..

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక ఎన్నికల నిర్వహణకు వెచ్చించాల్సిన డబ్బు ను జిల్లా యంత్రాంగం దాచి పెట్టిందా? మితంగా ఖర్చు చేసిన ఘనతను చాటుకునేందుకు ఖాతాలోనే నిల్వ ఉంచిందా? ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు జిల్లా పరిషత్ అధికారులే పొదుపు మంత్రం వల్లించారా? కారణాలేవైనా జిల్లాలో దాదాపు 40 మండలాల్లోని ఎంపీడీవోలు అడ్డంగా ఇరుక్కున్నారు. ఆదరాబాదరాగా ఎన్నికలకు జనరల్ ఫండ్ నుంచి నిధులు మళ్లించిన ఎంపీడీవోలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ‘అసలు జనరల్ ఫండ్ నుంచి ఎందుకు నిధులు ఖర్చు చేశారు. అవసరం మేరకు డబ్బు ఇప్పటికే విడుదల చేశాం.. అంతకు మించి ఇచ్చే ప్రసక్తి లేదు’ అంటూ జెడ్పీ అధికారులు కొత్త సూక్తులు వల్లించడంతో వారు బిత్తరపోతున్నారు.
 
  కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు తాము జనరల్ ఫండ్ నిధులు వాడాల్సి వచ్చిందని.. ఖర్చు చేసిన బిల్లులు మంజూరు చేయకపోతే తాము సొంతంగా జేబులో నుంచి భర్తీ చేస్తామా? అంటూ ఆందోళన చెందుతున్నారు. అదేమీ పట్టించుకోకుండా... జనరల్ ఫండ్‌కు సంబంధించిన అడ్వాన్సులు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన డిక్లరేషన్ సర్టిఫికెట్ అందజేయాలంటూ జెడ్పీ సీఈవో రెండు రోజుల కిందట ఎంపీడీవోలపై ఒత్తిడి పెంచారు. డిక్లరేషన్ ఇస్తే తప్ప బదిలీ చేసే ప్రసక్తి లేదని ఎన్నికల ముందు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీవోలకు తాఖీదులు జారీ చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణ ఖర్చుల వ్యవహారం వీధిన పడింది.
 
 ఏప్రిల్ మొదటి, రెండో వారాల్లో జిల్లాలో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. మే 13న ఓట్ల లెక్కింపు జరిగింది. పోలింగ్ మొదలు కౌంటింగ్ వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎంపీడీవోలదే. అందుకు వినియోగించే సిబ్బంది టీఏ, డీఏలు, పోలింగ్ సామగ్రి రవాణా, టెంట్లు, నీళ్లు, భోజనాలు ఇతరత్రా ఖర్చులన్నీ జిల్లా యంత్రాంగం ముందుగానే విడుదల చేయాలి. కానీ.. బడ్జెట్టు కేటాయింపు ఆలస్యమైంది. తక్షణ అవసరాలకు జనరల్ ఫండ్ నుంచి అడ్వాన్సులు తీసుకొని వాడుకోవాలని.. తర్వాత రీయింబర్స్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల శిక్షణ సమావేశాల సందర్భంగా ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మండలాల్లో ఎంపీడీవోలు అదే విధానాన్ని అమలు చేశారు. ఈలోగా జిల్లాలోని 57 మండలాలకు జెడ్పీ నుంచి మొత్తం రూ.4.47 కోట్లు ఎన్నికల బడ్జెట్టు విడుదలైంది. వీటిని మూడు విడతలుగా ఎంపీడీవోలకు అందించారు.
 
  కౌంటింగ్ ముగిశాక జిల్లా యంత్రాంగం మండలాల వారీగా ఎన్నికలకు మొత్తం ఎంత ఖర్చయింది? ఎన్ని నిధులు విడుదలయ్యాయి? ఇంకా ఎంతమొత్తం బిల్లు లు చెల్లించాల్సి ఉంది? అనే వివరాలను ఆరా తీసింది. జిల్లాలో రూ.6.36 కోట్లు ఖర్చు అయినట్లుగా లెక్క తేలింది. అప్పటికే తమకు విడుదల చేసిన రూ.4.48 కోట్లు మినహాయిస్తే... ఇంకా రూ.1.88 కోట్లు తమకు రావాల్సి ఉందని ఎంపీడీవోల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ బకాయిలు విడుదల చేయాల్సిన జిల్లా యం త్రాంగం తీరా ఎన్నికల తతంగం ముగిశాక కొత్త తిరకాసు పెట్టింది. పోలింగ్‌స్టేషన్ల సంఖ్యను బట్టి మొత్తం ఖర్చు రూ. 5.32 కోట్లు దాటకూడదని సీలింగ్ విధించింది.
 
 జిల్లాలో 2616 పోలిం గ్ స్టేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి కేవలం రూ. 20,340 చొప్పున చెల్లిం చేందుకు అంగీకరించింది. ఆ లెక్క ప్రకారం రూ.1.88 కోట్లు బకాయిలుంటే కేవలం రూ.83 లక్షలు చెల్లించి చేతులు దులుపుకుంది. మిగతా రూ.1.05 కోట్లు కోత పెట్టింది. వాటిని చెల్లిం చేందుకు ససేమిరా.. అంటూ ఎంపీడీవోలను జెడ్పీ చుట్టూ తిప్పుకుంటోంది. ఒక్క కరీంనగర్ మండలంలోనే రూ.9 లక్షలు బకాయి ఉన్నట్లు ఎంపీడీవో నివేదిస్తే.. జిల్లా అధికారులు కేవలం రూ.3 లక్షలు విడుదల చేశారు.
 
 ఇదే తరహాలో 45 మండలాల్లో ఎంపీడీవోలు ఖర్చు చేసిన సొమ్ముకు  విడుదలైన నిధులకు భారీగా వ్యత్యాసముంది. దీంతో జనరల్ ఫండ్ నుంచి అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులు ఎలా భర్తీ చేయాలి.. అనేది ఎంపీడీవోలకు తలనొప్పిగా మారింది. తాము ఖర్చు పెట్టిన బిల్లులు మంజూరు చేయాల్సిందేనంటూ జెడ్పీ సీఈవో, డెప్యూటీ సీఈవో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ.. నిర్ణీత సీలింగ్‌కు మించి డబ్బులు ఇచ్చేది లేదని అధికారులు మొండికేయడంతో రోజురోజుకు ఈ వివాదం ముదురుతోంది.
 
 ఎన్నికల ఖర్చుకు సీలింగ్ ఉంటే.. ముందుగానే తెలియపరచాల్సిన అధికారులు ఎందుకు దాచిపెట్టారనేది అంతుచిక్కడం లేదు. పొరుగున ఉన్న వరంగల్ జిల్లాలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి రూ.28 వేల చొప్పున ఎన్నికల నిర్వహణ ఖర్చును విడుదల చేస్తే.. మన జిల్లాలో రూ.20,340 చొప్పున ఎందుకు సీలింగ్ విధించారు...? ఎన్నికల బడ్జెట్‌లో రూ.80 లక్షలకు పైగా ఇప్పటికీ ఖాతాలో ఉన్నాయని.. వాటిని విడుదల చేయకుండా అధికారులు సీలింగ్ పేరుతో వేధిస్తున్నారని ఎంపీడీవోలు చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలేమిటో తెలియాలంటే... వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement