ఆప్షన్లు ఉంటాయని చెప్పామా?: జైరాం రమేశ్
తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్
స్థానికత, తక్కువ సర్వీసు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ, ఆప్షన్లు, ప్రత్యేక పరిస్థితులు..ఇలా ఉద్యోగుల విభజనకు ఆరు ప్రాతిపదికలున్నాయి
వారంలో మార్గదర్శకాలు విడుదల చేస్తాం
ఆప్షన్లు ఉండకూడదని ఉద్యోగ సంఘాల డిమాండ్
హైదరాబాద్: ‘‘ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు కచ్చితంగా ఉంటాయని ఎవరు చెప్పారు? నేను లేదా జీవోఎం ఇతర సభ్యులు ఎవరైనా అధికారికంగా ప్రకటన చేశారా? రాజకీయ పార్టీలు ఏవో తప్పుగా ప్రచారం చేస్తే పట్టించుకుంటారా?..’’ అని తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల విభజనకు ఆరు ప్రాతిపదికలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పన కూడా ఇప్పటికే పూర్తయిందని, వారం రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవిభజనపై ఏర్పాటు చేసిన జీవోఎం సభ్యుడి హోదాలో గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జైరాం రమేశ్ సమావేశమయ్యారు. సి.విఠల్, ఎం.నారాయణ (తెలంగాణ ఉద్యోగుల సంఘం), చంద్రశేఖర్‌గౌడ్, హరికిషన్ (గ్రూప్-1 అధికారుల సంఘం), పి.రఘు (విద్యుత్ ఉద్యోగుల జేఏసీ), పి.మధుసూదన్‌రెడ్డి (ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్), శివశంకర్ (రెవెన్యూ ఉద్యోగుల సంఘం), రాములు (ఉపాధ్యాయ సంఘం), సురేశ్ (సచివాలయ టీఎన్జీవో), శ్యాం కుమార్ (వాణిజ్యపన్నులు) తదితర ముఖ్య సంఘాల నేతలు సహా తెలంగాణకు చెందిన 27 ఉద్యోగ సంఘాలకు చెందిన దాదాపు 70 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. ‘‘రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371(డీ) ప్రకారం ఏర్పాటైన జోనల్ వ్యవస్థ అమల్లో ఉండగా తెలంగాణేతర ఉద్యోగులకు ఆప్షన్లు ఎలా ఇస్తారు? తెలంగాణ రాష్ట్రంలోనూ సీమాంధ్ర ఉద్యోగులను ఎలా భరిస్తాం?..’’ అని జైరాంను తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వవద్దని, స్థానిక ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జైరాం రమేశ్... జీవోఎం సభ్యుడిగా ఆప్షన్ల అంశంపై మాట్లాడుతున్నా. ఆప్షన్లు మాత్రమే ఉంటాయని ఎవరూ, ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు. ఉద్యోగుల పంపకానికి ఆరు ప్రాతిపదికలు ఉన్నాయి. స్థానికత, తక్కువ సర్వీసు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371(డి) ప్రకారం అమలులో ఉన్న జోనల్ వ్యవస్థ, ఆప్షన్ల పరిశీలన, కొన్ని ప్రత్యేక పరిస్థితుల ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుంది..’’ అని వివరించారు. ‘‘ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న అవకాశాలు, మానవతా దృక్పథం వంటివి ప్రత్యేక పరిస్థితుల కిందకు వస్తాయి.
ఉద్యోగుల పంపకంపై మార్గదర్శకాలను ఇప్పటికే రూపొందించాం. వాటిని ప్రకటించడానికి ఎన్నికలకోడ్ అమలులో ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాం. వారంలోగా స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయి. వాటిని అధ్యయనం చేసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పండి’’ అని జైరాం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమేనని, ఎవరికీ అన్యాయం చేయబోమని పేర్కొన్నారు. కాగా, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదని చంద్రశేఖర్‌గౌడ్ అభిప్రాయపడగా.. పదేళ్ల ఉమ్మడి అడ్మిషన్ల విధానాన్ని సవ రించాలని మధుసూదన్‌రెడ్డి కోరారు. కార్పొరేషన్ ఉద్యోగుల విభజన అధికారం పూర్తిగా ఆయా కార్పొరేషన్లకే అప్పగించడంవల్ల అన్యాయం జరిగే అవకాశాలున్నాయని, దీనిపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త రఘు కోరారు. దీనిపై స్పందించిన జైరాం... వాటికి ప్రత్యేకంగా మార్గదర్శకాలుంటాయని హామీ ఇచ్చారు.