సాక్షి, హైదరాబాద్: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)–2020ను పాత ఫార్మాట్‌లోనే నిర్వహించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ నిర్వహణకు వినియోగించిన ఫార్మాట్‌నే ఈసారీ వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించుకోవాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ భేటీలో నిర్ణయించింది.
తాజాగా పాత ఫార్మాట్‌లోనే ఎన్పీఆర్ నిర్వహణపైనా తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కేరళ, పశ్చిమ బెంగా ల్ ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్పీఆర్ పనులను పూర్తిగా నిలిపేయగా రాజస్తాన్, పంజాబ్ శాసనసభలు ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. బిహార్‌లో ఎన్నార్సీ జరపబోమని, ఎన్పీఆర్‌ను సైతం పాత ఫార్మాట్‌లోనే నిర్వహిస్తామని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్డీఏ పాలనలో ఉన్న బిహార్ తరహాలోనే రాష్ట్రంలోనూ పాత ఫార్మాట్‌లో ఎన్పీఆర్ నిర్వహించేలా తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఏవైనా 45 రోజులపాటు ఎన్పీఆర్‌ను నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎన్పీఆర్ నిర్వహణపై శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
భయాందోళనలను దూరం చేసేందుకు...
ఎన్పీఆర్–2020 కరదీపికలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ప్రతి పౌరుడు తనతోపాటు తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం వివరాలను కచ్చితమైన సమాచారంతో ఇవ్వాల్సి ఉంది. అయితే అత్యధికం మంది వద్ద పుట్టిన తేదీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఇతర ఆధారాలు లేవు. అలాగే చాలా మందికి కచ్చితమైన పుట్టిన తేదీ తెలియదు. దీనికితోడు చనిపోయిన తల్లి దండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం తెలిసి ఉండే అవకాశం తక్కువే. నిరక్షరాస్యులైన పేదల వద్ద వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండవు. ఎన్పీఆర్–2020 ఫార్మాట్‌లో అడిగే ప్రశ్నలన్నింటికీ ప్రజలు ‘స్వచ్ఛందంగా’ఆధారాలు చూపించాలని కేంద్రం పేర్కొంటోంది. మరోవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్సీ) నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తామని కేంద్రం ప్రకటించింది.
మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత హింసకు గురై 2014 డిసెంబర్ నాటికి భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైనులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది. ఎన్నార్సీకి ఎన్పీఆర్ డేటాబేస్ మూల ఆధారమని కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్ పేర్కొంటోంది. ఎన్పీఆర్, సీఏఏ, ఎన్‌ఆర్సీలలో ఒకదానితో మరొకటికి సంబంధం లేదని కేంద్రం పేర్కొంటున్నా దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నార్సీలో చోటు సంపాదించని వారిలో ముస్లిమేతరులందరికీ సీఏఏ కింద పౌరసత్వం లభించనుందని, చివరికి తమ పౌరసత్వమే ప్రశ్నార్థకం కానుందని ముస్లింలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలను దూరం చేసేందుకు ఎన్పీఆర్‌ను పాత ఫార్మాట్‌లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
పాత ఫార్మాట్ సులువు...
ఎన్పీఆర్–2011 ఫార్మాట్‌ను వినియోగిస్తే 15 ప్రశ్నలకు సాధారణ రీతిలో సమాధానమిస్తే సరిపోనుంది. పేరు/కుటుంబ పెద్దతో సంబంధం/తండ్రి పేరు/తల్లిపేరు/జీవిత భాగస్వామి పేరు (ఒకవేళ వివాహితులైతే)/లింగం/పుట్టిన తేదీ/వివాహితులా కాదా?/పుట్టిన ప్రాంతం/జాతీయత/ప్రస్తుత చిరునామా/ప్రస్తుత చిరునామాలో ఎన్నాళ్ల నుంచి నివాసం/శాశ్వత చిరునామా/వృత్తి/విద్యార్హతల సమాచారాన్ని ఎన్యూమరేటర్లు కోరనున్నారు. ఒకవేళ ఎన్పీఆర్–2020 ఫార్మాట్‌ను వినియోగిస్తే ఇవే ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని మరింత లోతుగా, ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలతో ప్రజలు ఇవ్వాల్సి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment