వేధింపులకు కళ్లెమేదీ? | Growing harassment on women in Hyderabad | Sakshi
Sakshi News home page

వేధింపులకు కళ్లెమేదీ?

Published Fri, Aug 18 2017 12:37 AM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

వేధింపులకు కళ్లెమేదీ? - Sakshi

వేధింపులకు కళ్లెమేదీ?

పని ప్రదేశాల్లో మహిళలపై పెరుగుతున్న వేధింపులు

రమ..
ఓ కార్పొరేట్‌ ఆఫీస్‌లో మానవ వనరుల విభాగంలో పనిచేస్తోంది. ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు చలాకీగా కనిపించే ఆమె.. ఇంటికి రాగానే దిగాలుగా కన్పిస్తోంది! తనలో తానే కుమిలిపోతోంది. ఓరోజు భర్తకు అసలు విషయం చెప్పి గొల్లున ఏడ్చింది. తన పైఅధికారి అనుచిత ప్రవర్తనను భరించలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. పోలీస్‌ కేసు నమోదు చేద్దామన్న భర్త సలహాను సున్నితంగా తిరస్కరిస్తూ.. విషయం పెద్దదైతే పరువు పోతుందని వాపోయింది.

సునీత..
ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఏడాదికి రూ. 5.5 లక్షల ప్యాకేజీతో ఉద్యో గంలో చేరింది. రెండేళ్లలో రెట్టింపు జీతంతో పదో న్నతి పొందింది. కానీ ఈ మధ్య ఉద్యోగం మానేస్తానని, లేదంటే వేరే కంపెనీలో చేరతానని భర్తతో అంటోంది. కారణం తెలుసుకు నే ప్రయత్నం చేశాడు సునీత భర్త. టీమ్‌ లీడర్‌ వేధింపులే  కారణమని తెలియ డంతో కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. స్పందించిన యాజమాన్యం.. సునీతను మరో టీమ్‌కు బదిలీ చేసిం ది. ఆ టీమ్‌లోనూ సర్దుకోలేక సునీత ఉద్యోగానికి రాజీనామా చేసింది.

సాక్షి, హైదరాబాద్‌ : చట్టాలున్నా.. ఎన్నో నియంత్రణలు ఉన్నా పనిచేసే చోట మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో కార్పొరేట్‌ కంపెనీల్లో స్వేచ్ఛగా పనిచేయాలంటే మహిళలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. హైదరాబాద్‌లోనూ కార్పొరేట్‌ కంపెనీలతో పాటు సాధారణ, మధ్య తరహా సంస్థల్లో వేధింపులు తీవ్రంగా ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సగటున 58 శాతం మహిళలు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నట్లు ఆ శాఖ ఇటీవల నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది.

మహిళలు ఉద్యోగం చేసే చోట వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు 2013లోనే కేంద్రం ‘సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌ యాక్ట్‌’ను తెచ్చింది. ఈ చట్టం ప్రకారం.. పదిమంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సంస్థ, కార్యాలయంలో కచ్చితంగా ఇంటర్నల్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. ఇందులో మహిళా ఉద్యోగులనే ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేయాలి. లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన, పరుష పదజాలంతో దూషణ తదితర పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు నేరుగా ఈ కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు.

 ఆ ఫిర్యాదుపై వెంటనే కమిటీ సమావేశమై విచారణ చేసి, తక్షణ చర్యలకు యాజమాన్యానికి సిఫార్సు చేయాలి. యాజమాన్యం ఆ సిఫార్సును అమలు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పకుండా ఏర్పాటు చేయాలి. కానీ వీటి ఏర్పాటు, నిర్వహణ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.

కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా కమిటీ
చట్టం ప్రకారం ప్రతి ఆఫీసులో అంతర్గత కమిటీ ఉన్నట్టే.. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీ ఉంటుంది. కార్యాలయాలు, సంస్థల్లోని కమిటీలో స్పందన లేకుంటే జిల్లా స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. జిల్లాస్థాయికి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవే ఉంటున్నాయి. గతనెలలో రాష్ట్రవ్యాప్తంగా 19 కేసులు జిల్లాస్థాయి కమిటీ దృష్టికి రాగా.. వాటిలో 17 కేసులను పరిష్కరించారు. వీటిలో అధికంగా నల్లగొండ జిల్లాలో 5, వరంగల్‌ జిల్లాలో 4, నిజామాబాద్‌ జిల్లాలో 3 కేసులున్నాయి. మరో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి.

పేరుకే.. కమిటీలు!
వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తెచ్చిన చట్టంపై క్షేత్రస్థాయిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంది. కార్పొరేట్‌ కంపెనీలు మినహాయిస్తే మధ్య తరహా, చిన్న కంపెనీల్లో అంతర్గత కమిటీలే ఏర్పాటు కాలేదు. కొన్నిచోట్ల కమిటీలు ఏర్పాటు చేసినా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడం, సమస్యలపై చర్చించడం లాంటివి జరగడం లేదు. ఈ కమిటీలపై పర్యవేక్షణ కూడా పెద్దగా లేకపోవడంతో చట్టం పకడ్బందీగా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్తగా ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ (181)ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

ఫిర్యాదుకు వెనుకాడుతున్న బాధితులు
పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్న మహిళల్లో చాలామంది ఫిర్యాదుకు దూరంగా ఉంటు న్నారు. ఫిర్యాదు చేస్తే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయంతో కొందరు, ఇంక్రిమెంట్లు, పదోన్నతిలో ఇబ్బందులు వస్తాయేమోనన్న భావనతో మరికొందరు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement