
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులపైనా జీఎస్టీ భారం పడనుంది. వివిధ ఉమ్మడి ప్రవేశపరీక్షల (సెట్‌ల)కు హాజరయ్యే ఒక్కో అభ్యర్థి సగటున రూ. 70 వరకు అదనంగా చెల్లించాల్సి రానుంది. మొత్తంగా సుమారు 4.95 లక్షల మంది విద్యార్థులపై జీఎస్టీ రూపంలో రూ.3.5 కోట్ల అదనపు భారం పడనుంది. టీఎస్ ఆన్‌లైన్, ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ల అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్, లాసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్, పాలీసెట్ వంటి పరీక్షల ఫీజుపై పన్ను రూపంలో ఈ భారం పడనుంది.
ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలో..
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వివిధ కోర్సుల ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మంగళవారం ఉన్నత విద్యా మండలితో టీఎస్ ఆన్‌లైన్–టీసీఎస్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశపరీక్షలను టీఎస్ ఆన్‌లైన్–టీసీఎస్ నిర్వహించనున్నాయి.
గతేడాది విద్యార్థుల లెక్కతో..
పరీక్షల నిర్వహణ ఒప్పందం నేపథ్యంలో వి ద్యార్థులపై పడే జీఎస్టీ ప్రభావాన్ని టీఎస్ ఆన్ లైన్–టీసీఎస్ అంచనా వేశాయి. గతేడాది ప్రవేశపరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి భారాన్ని తేల్చాయి. ఏటా సుమారు 4.95 లక్ష ల మంది వివిధ ప్రవేశపరీక్షలకు దరఖాస్తు చే సుకుంటున్నారు. ఇందులో ఒక్క ఎంసెట్‌కే దా దాపు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు దర ఖాస్తు చేసుకుంటుండగా.. ఐసెట్‌కు దాదాపు 80 వేల మంది వరకు హాజరవుతున్నారు. మిగతావారు ఎడ్‌సెట్, ఈసెట్, పీఈసెట్, పీజీఈసెట్ వంటి పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వారు చెల్లించే పరీక్ష ఫీజుపై ఇప్పటివర కు పన్ను మినహాయింపు ఉండగా.. ఈ ఏడాది నుంచి జీఎస్టీ చెల్లించాల్సి రానుంది. ఈ భారం ఒక్కో విద్యార్థిపై రూ.70 వరకు ఉం టుందని అంచనా వేశారు. దీనికితోడు ఆన్‌లైన్, ప్రాసెసింగ్ ఫీజు కలిపి ఒక్కో విద్యార్థిపై రూ.100 నుంచి రూ.150 వరకు భారం పడే అవకాశముందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment