
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హరీశ్ విందు
125 మంది అధికార, విపక్ష నేతల హాజరు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం మొదటి దశ పనులు విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విందు ఏర్పాటు చేశారు. నగరంలోని ఓ హోటల్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ విందుకు స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలతోపాటు, 125 మంది అధికార టీఆర్‌ఎస్, విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యా రు.
మిషన్ కాకతీయ మొదటి దశ పనుల తరహాలోనే.. రెండో విడత పనులు కూడా వేగం గా పూర్తయ్యేందుకు సహకరించాల్సిందిగా హరీశ్ కోరారు. పనులు మంజూరైన చోట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీక్షలు నిర్వహిస్తూ.. లోటుపాట్లకు తావులేకుండా.. నాణ్యతతో జరిగేలా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు సహకరిస్తేనే పనులు వేగం గా జరుగుతాయన్నారు. ఏప్రిల్ 1 నుంచి మిషన్ కాకతీయ వారోత్సవాలు నిర్వహించాలని ప్రజా ప్రతినిధులను హరీశ్ కోరారు.
ఏఈఈలకు పోస్టింగ్ ఆర్డర్లు...
టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇటీవల నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 128 మందికి మంత్రి హరీశ్‌రావు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. నీటి పారుదలశాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్యోగులందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని, బంగారు తెలంగాణ సాధనలో నూతనంగా ఎంపికైన ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని హరీశ్ కోరారు.