
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ)కి సంబంధించి జీవో నెంబర్ 25ను సవరించి తీరాల్సిందేనని శుక్రవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. 10 జిల్లాల ప్రకారమే టీఆర్‌టీ నోటిఫికేషన్ ఉండాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.
పదిజిల్లాల ప్రాతిపదికన కాకుండా 31 జిల్లాల ప్రాతిపదికన పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై పలుదఫాలుగా హైకోర్టులో విచారణ జరిగింది. బుధవారం తుది వాదనలు విన్న కోర్టు నేడు తీర్పు వెలువరించింది.
పిటిషనర్ వాదన...
పాఠశాల విద్యా శాఖ అక్టోబర్ 10న జీవో నెంబర్ 25, అందుకు అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్ మరో ముగ్గురు వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణలోని పూర్వపు పది జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదముందని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఆమోదం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి వాదించారు. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలోని అభ్యర్థి పూర్వపు జిల్లాలో స్థానికేతరుడిగా నష్టపోతున్నారని చెప్పారు. 1976లోనే లోకల్ కేడర్ నిర్ధారణ జరిగిందని, కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాల్ని పరిగణనలోకి తీసుకోవడం చెల్లదన్నారు. పాలనా సౌలభ్యం కోసమే 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు కూడా కొత్త జిల్లాల్ని ప్రామాణికంగా తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
అడ్వొకేట్ జనరల్ వాదన...
31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ నియామకాల్ని సవాల్ చేసిన వ్యాజ్యంలో అంతిమంగా పిటిషనర్లు విజయం సాధిస్తే.. పూర్వపు పది జిల్లాలకే టీఆర్‌టీని వర్తింపజేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే జరిగితే దరఖాస్తుల స్వీకరణ గడువు 15 రోజులు పొడిగిస్తామని చెప్పారు. అభ్యర్థులు పది జిల్లాల్లో ఎక్కడి వారో తెలుసుకునేందుకు అధికారులకు ఇబ్బందేమీ లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే టీఆర్‌టీ నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేలా చూడాలని, పరీక్ష వాయిదా పడకుండా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహిస్తే స్థాని క అభ్యర్థులకు అన్యాయం జరగదని, రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లు కాదని ఏజీ వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment