ఐదు కొత్త ఆస్పత్రులు
- ప్రత్యేకంగా మాతా శిశుసంరక్షణకు రూ.35 కోట్లతో నిర్మాణం
- అచ్చంపేట, ఏటూరునాగారం, కామారెడ్డి, మంథని, సూర్యాపేటలో ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు మాతా శిశుసంరక్షణ ఆస్పత్రులను నిర్మించనుంది. అచ్చంపేట, ఏటూరునాగారం, కామారెడ్డి, మంథని, సూర్యాపేటలో వీటిని నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వైద్యశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 50 పడకల సామర్థ్యంతో వీటిని నిర్మించనున్నారు. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ.7 కోట్ల చొప్పున మొత్తం రూ.35 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) నిధులతో ఈ ఆస్పత్రులను నిర్మించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 5, వరంగల్‌లో 2... ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, ఖమ్మం, భద్రాచలం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాద్, కామారెడ్డి, తాండూరులో ఒక్కోటి చొప్పున ప్రసూతి వైద్య ఆస్పత్రులు, కేంద్రాలు ఉన్నాయి.
మరో ఎనిమిది కేంద్రాల నిర్మాణం కొనసాగుతోంది. కింగ్‌కోటి(హైదరాబాద్), జనగామ, సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, తాండూరు, మహబూబ్‌నగర్, నల్లగొండలో ప్రత్యేకంగా ప్రసూతి ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తి కాగానే కొత్త ఆస్పత్రుల నిర్మాణ ప్రక్రియ మొదలుకానుంది.